వివాదాస్పద వక్ఫ్‌ సవరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందుతుందా ?

Will the controversial Waqf Amendment Bill be passed in Parliament?

ఏప్రిల్ 4 తో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్నాయి. ఆ తేదీలోగా వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా ? ఇదే అందరిలో ఉత్కంఠ రేపుతోంది. అధికార ఎన్డీఎ కూటమి ఎలాగైనా ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం చెందేలా చేస్తాము అంటూ ఉంటే, ఈ బిల్లు ఆమోదం పొందదు , పొందకుండా చేస్తాము అని , ఇండియా కూటమి నాయకులు సవాల్ విసురుతున్నారు.

అసలు ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు నుంచీ వక్ఫ్‌ సవరణ బిల్లుపై రాజకీయ వర్గాల్లో, చర్చలు రగులుతూనే వున్నాయి. MIM సహా అనేక ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలు వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. గతంలో ఇండియా కూటమి డిమాండ్ మేరకు వక్ఫ్‌ సవరణ బిల్లు పై ప్రభుత్వం జేపీసీ(జాయింట్ పార్లమెంట్ కమిటీ ) ఏర్పాటు చేసింది. ఆ జేపీసీ ఇచ్చిన నివేదికను, అది సూచించిన సవరణలతో సహా కేంద్ర మంత్రి వర్గం, ఫిబ్రవరిలో ఆమోదించింది. అందుకే ఇప్పుడు హోం మంత్రి అమిత్ షా , ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.

ఇప్పుడు ఈ బిల్లు పై ఎవరు అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ? కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని తమ మద్దత్తు ద్వారా నిలబెడుతున్న, టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయు) , ఈ బిల్లుపై ఏ నిర్ణయం తీసుకుంటారు ? ఇదే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

అసలు వక్ఫ్ సవరణ బిల్లు లో ఏ అంశాలు వున్నాయి.? అసలు వక్ఫ్ చట్టంలో ఏముంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది.

వక్ఫ్ అంటే?

“వక్ఫ్” అనేది ఇస్లామిక్ ప్రయోజనాలకు ఉద్దేశించిన ధర్మబద్ధమైన, మతపరమైన లేదా ధార్మికమైన పదం.

మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్‌ చట్టాన్ని తీసుకువచ్చారు. . అయితే ఆ తర్వాత పలుమార్లు.. ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించి, ప్రభుత్వం మరిన్ని అధికారాలను కట్టబెట్టింది.

 

వక్ఫ్ బోర్డు అంటే..

1995 లో వక్ఫ్ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం లో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం స్థాపించిన సంస్థే ఈ వక్ఫ్ బోర్డు . ఈ వక్ఫ్ బోర్డు , మసీదులతోపాటు, దర్గా, శ్మశానవాటికలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు. వాటి స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా రక్షిస్తాయి. ప్రస్తుతం దేశంలో 30 వక్ఫ్ బోర్డులు వున్నాయి, వీటి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.

ఆ తర్వాత 2013 లో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. .. వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్‌ చేయలేని విధంగా.. ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే, తమిళనాడులోనిఒక వక్ఫ్‌ బోర్డు ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించేతగా. ఆ సంఘటన వివాదానికి కూడా దారి తీసింది.

 

ఇప్పుడు తాజాగా ఈ వక్ఫ్ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని కేంద్ర బీజేపీ తలచింది. ఆ సవరణల బిల్లే, ఈ ఏప్రిల్ 4 లోగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా చేస్తోంది.

వక్ఫ్ సవరణ చట్టంలో ఏముంది?

ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని ,అందుకే, ఈ వక్ఫ్‌ బోర్డుకు ఎక్కువ అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని.. ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయని , కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, ట్రస్ట్‌లు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను.. స్వతంత్ర హోదాను వక్ఫ్‌ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది.

వక్ఫ్ చట్టానికి తాజా సవరణలు ఎందుకు?

తాజా సవరణలు చేయడం ద్వారా వక్ఫ్‌ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చెయ్యాలి, దీనివల్ల వల్ల వక్ఫ్‌ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుంది, సెంట్రల్‌, స్టేట్‌ వక్ఫ్‌ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలి, వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలి, ఇవీ ఈ చట్ట సవరణలో బిల్లు లో పెట్టిన అంశాలు . ఎందుకంటే , వక్ఫ్‌ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించటం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయి, బిల్లు చట్టరూపం దాల్చితే.. వక్ఫ్‌ బోర్డులు ముందు లాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు. ఈ బిల్లు వల్ల వక్ఫ్ బోర్డులకు వున్న ఆస్తులు, వాటికే ఉంటాయి. అయితే, ఆ బోర్డు ల నిర్వహణ విధానం మాత్రమే మారుస్తున్నారు.

ఈ బిల్లు కు ఎవరెవరు అడ్డుపడుతున్నారు ?

ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024 లోనే లోక్‌సభలో ప్రవేశపెట్టాలని చూస్తే, అప్పుడు కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణముల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి, ముందు ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ – జేపీసీకి పంపించాలని ఈ పార్టీ లు పట్టుబట్టాయి. దీంతో అందుకు అంగీకరించిన కేంద్రం.. ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జేపీసీ ఇచ్చిన నివేదికను, అది సూచించిన సవరణలతోసహ కేంద్ర మంత్రి వర్గం, ఫిబ్రవరిలో ఆమోదించింది. అందుకే ఇప్పుడు హోం మంత్రి అమిత్ షా , ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.

ఈ వక్ఫ్ చట్ట సవరణల బిల్లుకు మేము వ్యతిరేకం, వక్ఫ్ బోర్డుల చట్ట ప్రతిపత్తి, అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా మేము సహించం అని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు హెచ్చరించింది. ఈ వక్ఫ్ చట్ట సవరణల బిల్లును తిరస్కరించవలసిందిగా ఎన్‌డీఏ పక్షాలకు, ప్రతిపక్షాలకు కూడా బోర్డు విజ్ఞప్తి చేసింది.

ఒక ప్రక్క చట్టంలో సవరణలు చేయవద్దని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండగా, మరో ప్రక్క, వక్ఫ్‌ బోర్డుల్లో తమకు చోటివ్వడం లేదని, చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలు చాలాకాలంగా కోరుతున్నారు

వక్ఫ్‌ సంపదను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపిస్తున్నారు. కానీ, కేంద్ర బీజేపీ మాత్రం, ఈ బిల్లు ద్వారా కేవలం వక్ఫ్‌ బోర్డుల నిర్వహణ విధానం మాత్రమే మారుస్తున్నామని చెబుతోంది.

అయితే, ఈ బిల్లు ఆమోదం పొందాలంటే, పార్లమెంట్ లో , ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ, బీహార్ లో జనతాదళ్ యునైటెడ్ (జేడీయు), పార్టీ ల మద్దత్తు తప్పనిసరిగా అవసరం.

జనతాదళ్ యునైటెడ్ (జేడీయు) విషయం తీసుకుంటే, ఈ సంవత్సరం చివర్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ బిల్లుని ఆమోదించవద్దని, సీఎం నితీష్ కుమార్ పై, అక్కడ ముస్లిం లు వత్తిడి తెస్తున్నారు . దానిలో భాగంగానే, ఈ ఈ మధ్యే సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించి, జేడీయు పట్ల తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి.. కానీ జేడీయు వర్గాలు మాత్రం , మేము ముస్లిం సంస్థలతో చర్చలు జరిపి, వారిని వొప్పించామని చెబుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కు ఇక్కడ ముస్లింలు వ్యతిరేకంగానే వున్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం, ఈ బిల్లు కు తమ పార్టీ ఆమోదం తెలిపినా, రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులకు ఏ డోఖా లేదు, వాటికి , సంపూర్ణ రక్షణ కల్పిస్తామని, ముస్లిం లకు గట్టి హామీ ఇచ్చారు, దీనివల్ల ఇక్కడ చంద్రబాబు కు ఏమాత్రం ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు.

 

మరి ప్రతిపక్ష ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి ?

అందులో వున్న పార్టీలు కూడా అటూ ఇటూ తేల్చుకోలేకుండానే ఉన్నాయని అంటున్నారు, ఈ కూటమి లో వున్న ప్రధాన పార్టీ, కాంగ్రెస్ లోనే , ఈ బిల్లు ఏకాభిప్రాయం లేదని అంటున్నారు.

మొత్తానికి ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ఏ పార్టీ లు మద్దత్తు ఇస్తాయి, ఏ పార్టీ లు మద్దత్తు ఇవ్వవు, ఏ పార్టీ లు అసలు వోటింగ్ కు రాకుండా తప్పించుకుంటాయి. అని దేశం లోని అన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *