ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా తన అన్న, ముఖ్యమంత్రి జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా సీఎం జగన్ తీరును తూర్పారబడుతూ బహిరంగ లేఖ రాశారు వైఎస్ షర్మిల. రాష్ట్ర హక్కుల సాధన విషయంలో ప్రభుత్వ అనుసరిస్తున్న తీరును ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవ్వాలని ఇటు సీఎం జగన్, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు షర్మిల.
తన లేఖలో అమలు కాని విభజన హామీలు అని కొన్ని అంశాలను ప్రస్తావించారు వైఎస్ షర్మిల. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా, విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, కొత్త రాజధాని నగర నిర్మాణం. ఇవి కాకుండా భవిష్యత్తు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.