
తీన్మార్ మల్లన్నపై కవిత అనుచరుల దాడి – గాల్లోకి కాల్పులు !
తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజా ఉదంతం కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన , ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆఫీస్ పై కవిత కు చెందిన జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలు గా అనుమానిస్తున్న కొందరు దాడి చేసారు. అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసారు. ఈ మధ్యే BRS కార్యకర్తలు, మహా న్యూస్ కార్యాలయం పై దాడి చేసి, అక్కడ కూడా ఫర్నిచర్ ధ్వంసం చేసారు, జై తెలంగాణ అంటూ నినాదాలు చేసారు, ఆ కేసు ఏమైందో తెలియదు. ఈరోజు మల్లన్న ఆఫీస్ పై దాడి ని మీడియా పై దాడి గా చూడాలా ?
అసలు ఏం జరిగింది ?
తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ లో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న కవిత అనుచరులు దాదాపు 50 మంది ఆ ఆఫీస్ కు చేరుకొని దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసారు. ఈ దాడిలో మల్లన్న తప్పించుకోగలిగినా, మల్లన్న గన్‌మెన్‌పై కవిత అనుచరులు పిడిగుద్దులు కురిపించారు. దెబ్బలకు తాళలేక లోపలికి వెళ్లిన గన్‌మెన్ ఐదు రౌండ్ల గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ లోగా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేలోపు, జై తెలంగాణ అని నినాదాలు చేస్తూ ( ఈ దాడికి తెలంగాణ కు సంభందం ఏమిటో తెలియదు ), అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు , ఈ దాడి సంఘటన మొత్తం సీసీ టీవీ లో రికార్డు అవడంతో, ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తిచే అవకాశం వుంది.
తీన్మార్ మల్లన్న నేపధ్యం ఏమిటి ?
చింతపండు నవీన్, ఈ పేరంటే , ఎవరూ గుర్తుపట్టరు కానీ తీన్మార్ మల్లన్న అంటే వెంటనే గుర్తుపడతారు, వి6 ఛానల్ లో వచ్చిన తీన్మార్ మల్లన్న ప్రోగ్రాం తో గుర్తింపు పొంది , ఆ తరువాత అదే పేరుతో, టివీ5 ఛానల్ లో కొంత కాలం పని చేసి, ఆ తరువాత సొంతంగా Qన్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సోషల్ మీడియా లో పాప్యులర్ అయ్యారు.
గత 5 ఏళ్ళు, BRS (అప్పట్లో TRS ), KCR మీద ఆ పార్టీ విధానాల మీద పోరాడేవాడు, ఒకరకంగా విరుచుకుపడేవాడు. అప్పటి KCR ప్రభుత్వం ఈయన మీద అనేక కేసులు పెట్టింది, అతని స్టూడియో మీద దాడులు కూడా జరిగాయి. అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, అయినా వెనుతిరగకుండా KCR మీద, తన Q న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా, పోరాడాడు.
మొదటిసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయినా రెండో స్థానం లో నిలిచి సంచలనం సృష్టించాడు. KCR , BRS దాడులు తట్టుకోడానికి, 2021లో బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీ లో ఎక్కువకాలం వుండలేదు.
2023లో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు .
2023 లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత, రేవంత్ రెడ్డి ఆశీస్సులతో, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2024లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు శాసన మండలి లో అడుగుపెట్టాడు.
తరువాత మెల్ల మెల్లగా కాంగ్రెస్ పార్టీ విధానాలను విమర్శించడం మొదలుపెట్టాడు.
రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే తరువాత, తన విమర్శలను తీవ్రతరం చేసాడు.
బీసీ కులగణన సరిగ్గా నిర్వహించలేదని, అనేక లక్షల మంది బీసీ లను, ఆ జాబితాలో లేకుండా వెళ్ళగొట్టారని, తీవ్ర విమర్శలు చేసాడు. అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన ఆ కులగణన కాగితాన్ని , తన ఛానెల్ ప్రోగ్రాం లో కాల్చాడు, అది కాంగ్రెస్ పెద్దల ఆగ్రహానికి కారణమయ్యింది.
దానికి తోడు, తెలంగాణ కు బీసీ నే సీఎం కావాలని, రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణాకు ఆఖరి రెడ్డి సీఎం అని చెప్పడమే కాకుండా, బీసీలతో నిర్వహించిన పెద్ద బహిరంగ సభలో, రెడ్డి సామాజికవర్గాన్ని తీవ్రంగా విమర్శించాడు.
మల్లన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో ఆగ్రహించిన కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే పేపర్ ను బహిరంగంగా తగలబెట్టడం, పార్టీ ధిక్కరణ క్రిందే వస్తుందని” దీనికి సంజాయిషీ చెప్పాలని షో కాజ్ నోటీసు పంపారు.
మల్లన్న , ఆ నోటీసును ఖాతరు చెయ్యలేదు, దానికి జవాబివ్వలేదు.
ఈ చర్యతో మరింత ఆగ్రహించిన , కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ, తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మల్లన్న చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలని జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎలాంటి వివరణ రాలేదని..స్పందించలేదని అందుకే సస్పెండ్ చేస్తున్నామని”, చిన్నారెడ్డి పేరుతో జారీ అయిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్నను బహిష్కరించారు.
అప్పటినుండి, మల్లన్న బీసీ లకు ప్రత్యేక అధికారం కావాలని, బీసీ ల హక్కులు కాపాడాలని, బీసీ నే తెలంగాణ సీఎం కావాలని , పలు సభలు నిర్వహిస్తూ వచ్చాడు.
మల్లన్న టార్గెట్, బీసీ అయిన తానే సీఎం కావాలని , అందుకే మిగతా పార్టీలను టార్గెట్ చేస్తున్నాడనే టాక్ కూడా వుంది.
ఇప్పుడు మల్లన్న ఆఫీస్ పై , కవిత అనుచరుల దాడికి నేపధ్యం ఏమిటి ? దాడికి దారి తీసిన వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల బీసీ ఉద్యమాన్ని గట్టిగా నడిపిస్తున్నారు. బీసీ ల ఉద్యమం చేస్తే, తానే చెయ్యాలి కానీ, వేరొకరు ఎలా చేస్తారు, అది కూడా వెలమ వర్గానికి చెందిన కవిత బీసీ ల హక్కులపై ఉద్యమం చేయడానికి ఏ హక్కు వుంది అనే భావన లో వున్న మల్లన్న ఇటీవల ఒక సభలో, “కవితకు బీసీలతో కంచం పొత్తా..? మంచం పొత్తా..?” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసారు, ఆ వ్యాఖ్యలపై కవితే అనుచరులలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
ఈ పదాలు కేవలం అభ్యంతరకరమే కాకుండా, ఒక మహిళా నాయకురాలిపై అసభ్యంగా వ్యక్తిత్వ దూషణగా కవిత అనుచరులు భావించడంతో, వారి ఆగ్రహం తారాస్థాయికి చేరింది.
అందుకే మల్లన్న ఆఫీస్ పై , ఈ రోజు కవిత అనుచరులు దాడి చేసారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పోలీస్ లు వచ్చే లోపు వారు పారిపోయారు.
పోలీసుల రాక – కేసుల నమోదు
పోలీసులు మల్లన్న ఆఫీస్ కు చేరుకునేలోపు దాడి చేసినవారు అక్కడి నుంచి పారిపోయారు. దాడి మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో, పోలీస్ లు ఈ దాడి చేసిన వారిని గుర్తించారు, వారిపై కేసు లు నమోదు చేసారు, త్వరలో వారిని అరెస్ట్ చేస్తారేమో చూడాలి.
మల్లన్న హద్దు మీరాడా ?
బీసీ లకు జరుగుతున్న అన్యాయం ఇప్పుడే మల్లన్నకు గుర్తొచ్చిందా ? బీజేపీ లో చేరే ముందు, కాంగ్రెస్ లో చేరే ముందు చేరిన తరువాత, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మందు ఎందుకు గుర్తు రాలేదు ? మల్లన్న ఎమ్మెల్సీ గా గెలిచాడంటే, అన్ని కులాల వారు వోట్ వేస్తేనే కదా, కేవలం బీసీ లు మాత్రమే కాదు కదా. బీసీ ల గురించి ఎప్పటి నుండో పోరాడుతున్న ఆర్. కృష్ణయ్య 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు ? ఎందుకంటే, గెలవాలంటే, అన్ని కులాల మద్దత్తు కావాలి. కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే నమ్ముకుంటే, ఎన్నికల్లో గెలవలేరు. సీఎం సంగతి తరువాత, రేపు తాను పోటీ చేసి, అసలు ఎమ్మెల్యే గా గెలవాలన్నా , అన్ని సామాజిక వర్గాల ఓట్లు అవసరం అన్న సూత్రం మల్లన్న గుర్తెరగాలి.
హక్కుల గురించి పోరాడితే పోరాడాడు , కవిత కూడా ఇదే అంశం పై మాట్లాడితే , మల్లన్న కు ఉలుకెందుకు? పోనీ కవితను విమర్శించాడు, ఆ విమర్శలు ఏమైనా, సద్విమర్శలా ? ఒక మహిళా నాయకురాలి పై , ఈ రకంగా, అసభ్య వ్యాఖ్యలు చేయడం సబబా ? బీసీ ల హక్కుల గురించి మల్లన్న మాత్రమే ఉద్యమం చెయ్యాలా ? మిగతా పార్టీ ల వారు చేయకూడదా ? ఆ హక్కు తనకు మాత్రమే వుందని మల్లన్న అనుకోవడం విచిత్రం, చోద్యంగా వుంది. .
ఒక మహిళా నాయకురాలిపై ఇంత దారుణంగా ఎలా మల్లన్న మాట్లాడగలరు?” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు – కానీ విమర్శలకు కూడా హద్దులు ఉండాలన్నది వారి అభిప్రాయం.
ఇది మల్లన్నకు మొదటి దాడి కాదు. గతంలోనూ ఆయన BRS పార్టీ మీద చేసిన వ్యాఖ్యలతో BRS కార్యకర్తలు ఆగ్రహంతో దాడులు జరిపారు. తాజాగా మరోసారి అదే రకమైన సంఘటన జరిగింది.
మల్లన్న ఆఫీస్ పై, కవిత అనుచరుల దాడి సబబా ?
అదే రకంగా, మల్లన్న తమ నాయకురాలిని దూషించాడని , ఆగ్రహం చెందిన, కవిత అనుచరులు, మల్లన్న ఆఫీస్ ముందు ధర్నా చేయవచ్చు, పోలీస్ లకు ఫిర్యాదు చేయవచ్చు, అంతేకాని, దాడులు ఎలా చేస్తారు? అలా చేస్తే, ఫలితం ఏమిటి? పోలీసు కేసు లు, జైళ్లు , అదే కదా మిగిలేది. పైగా ఈ దాడులు చూసి, సమాజం ఏవగించుకుంటే, అది కవిత రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం, ఇప్పటికే లిక్కర్ కేసు లో జైలు కు వెళ్లొచ్చిన , కవిత పై , సామాన్య జనానికి సదభిప్రాయం పోయింది. ఇప్పుడు ఈ దాడులతో, ఆమె ఇమేజ్ ఇంకా దెబ్బ తినే ప్రమాదం వుంది.
భవిష్యత్తులో, అటు మల్లన్న, ఇటు కవిత, ఇలాంటి అతి చేష్టలకు పోకుండా, సంయమన రాజకీయం చేస్తేనే, వారికి రాజకీయాల్లో మనుగడ ఉంటుంది , అని గుర్తుంచుకోవాలి.