28th June 2025
ప్రముఖ టీవీ యాంకర్, కవయిత్రి, ఉద్యమ పాత్రికేయురాలు స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య.
హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన నివాసంలో జూన్ 27న స్వేచ్ఛ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె వయస్సు 40 ఏళ్లు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఈ మరణాన్ని అనుమానాస్పదంగా పరిగణించి విచారణ ప్రారంభించారు. స్వేచ్ఛ తన మరణానికి ముందుగా సోషల్ మీడియాలో ధ్యానం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేయడం, ఆ తర్వాత ఒక్కరోజులోనే ఆమె జీవితం ఇలా ముగియడం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
స్వేచ్ఛ జర్నలిజం ప్రయాణం
స్వేచ్ఛ తన జర్నలిజం ప్రయాణాన్ని మహా న్యూస్‌తో ప్రారంభించి, HMTV, TV9, V6, Namasthe Telangana వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. చివరగా ఆమె T News ఛానెల్‌లో స్పెషల్ కరస్పాండెంట్‌గా పని చేస్తూ ఉన్నారు. ఆమె ప్రజా సమస్యలపై స్పందన, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, కవిత్వం ద్వారా సామాజిక అంశాలను చర్చించడం ఆమెను ప్రత్యేకంగా నిలిపాయి. స్వేచ్ఛ రాసిన కవితా సంపుటి రెండు సంవత్సరాల క్రితం విడుదలై మంచి స్పందన పొందింది. ఆమె ఇటీవలి కాలంలో జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా గెలిచారు.
వ్యక్త్తిగత జీవితంలో ఒడిడుకులు
తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో ధైర్యంగా నిలిచిన స్వేచ్ఛ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులతో బాధపడినట్టు సమాచారం. ఆమెకు చిన్న కుమార్తె ఉన్నారు. గతంలో ఒక వివాహం జరిపి విడాకులు తీసుకున్న ఆమె, తర్వాత పూర్ణచంద్రరావు అనే ప్రోగ్రామింగ్ హెడ్‌తో సహజీవనం చేశారు. అయితే ఇటీవల ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం. స్వేచ్ఛ తన తండ్రితో “ఇప్పటికి అతనితో విడిపోతున్నా” అని చెప్పిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె తండ్రి పూర్ణచంద్రరావు పై తీవ్రమైన ఆరోపణలు చేశారు – “మా కూతురిని మోసం చేశాడు, పెళ్లి చేస్తానంటూ నమ్మించాడు, చివరకు ఆమెను ప్రాణాలు తీసుకునే స్థితికి నెట్టేశాడు” అని ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పూర్ణచంద్రరావును విచారణకు తీసుకొచ్చినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా అతడు స్వేచ్ఛ నివాసానికి రాకపోవడం, ఆమె సన్నిహితులకు తన మనస్తాపాన్ని వెల్లడించడమే కాకుండా, చివరి రోజుల్లో Insta పోస్ట్‌లు ద్వారా మానసిక స్థితిని తెలియజేసిన తీరు విచారకరంగా ఉంది. ఆమె మరణం తెలుగు మీడియా రంగానికి తీరని లోటు. ఒక ధైర్యవంతురాలు, ప్రామాణిక పాత్రికేయురాలు, కవయిత్రిని చిన్న వయసులోనే కోల్పోయినది ఎంతో దురదృష్టకరం.