Home » హోం » జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

patri vasudevan terminated from 99tv

1st July 2025

99 టీవీ నుండి, జర్నలిస్టు, న్యూస్ యాంకర్ , పత్రి వాసుదేవన్ ను తొలగించారు.

ఈ పత్రి వాసుదేవన్, ఇదివరకు CVR న్యూస్ లోను, తరువాత కొన్నాళ్ళు ప్రైమ్ 9 న్యూస్ లోను, న్యూస్ ఏంకర్ గా పని చేసేవారు. ఈయన ఎక్కడ పని చేసినా, మరి ఛానెల్ యాజమాన్యం ఆదేశాల మేరకు చేసారో, ఈయన తన స్వంత అభిప్రాయాలకు అనుగుణంగా పని చేసేవారో తెలియదు , కానీ, టీడీపీ కి , చంద్రబాబు కి వ్యతిరేకంగా గా ఉండేవి, ఈయన విశ్లేషణలు. దాన్ని కూడా తప్పు పట్టలేము, జర్నలిస్టులు, విశ్లేషకులు అని చెప్పుకునే వారందరు, పార్టీ ల వారిగా విడిపోయారు, ఏ పార్టీ అనుకూల ఛానల్ , ఆ పార్టీ కి అనుకూలమైన విశ్లేషకులు నే డిబేట్ లకు పిలుస్తుండటం సర్వ సాధారణమయిపోయింది, అది టీడీపీ అనుకూల మీడియా అయినా , వైసీపీ అనుకూల మీడియా అయినా సరే.

కానీ ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. జరిగినది 50% అయితే, దానికి తమ కల్పనా శక్తి జోడించి, ఇంకో 50% కూడా లేనిది, జరగనిది, చెప్పినా, సహించవచ్చు. కానీ, 0% కూడా ఎక్కడా , వాస్తవంగా అనిపించని విషయాన్ని కూడా ప్రజల మెదళ్లలో జొప్పించి, అది నిజంగా 100% జరిగింది అని నమ్మించాలని చూస్తే ఏమవుతుంది. ఈ పత్రి వాసుదేవన్ కు పట్టిన గతే పడుతుంది.

జర్నలిజం అంటే ప్రజలకు నిజాలను చెప్పడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం, సమాజంలో జరుగుతున్న వాస్తవాలను నిష్పాక్షికంగా చూపించడం. కానీ కొన్నిసార్లు ఈ పరిమితులను దాటితే పెద్ద వివాదాలకే కారణమవుతుంది. ఇటీవల 99 టీవీకి చెందిన సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ ఎడిటర్ పత్రి వాసుదేవన్ చేసిన ఒక వార్తా విశ్లేషణ దీనికి ఉదాహరణ.

అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారంటూ, జగన్ భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ, తన దగ్గర ఇంటెలిజెన్స్ నివేదిక ఉందంటూ, 99టీవీ లో చేసిన ఒక ప్రోగ్రాం, ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది, చివరకు అయన వుద్యోగం పోవడమే కాకుండా, అజ్ఞాతం లోకి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.

పత్రి వాసుదేవన్ చేసిన ఆరోపణలు

99 టీవీలో ప్రసారమైన ఒక కార్యక్రమంలో పత్రి వాసుదేవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణమయ్యాయి. ఆయన మాట్లాడుతూ జగన్‌ను హతమార్చేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు భారతదేశానికి వచ్చారని, ప్రభుత్వం ఆయన భద్రతను పట్టించుకోవడం లేదని చెప్పారు. అంతేకాకుండా తన దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని కూడా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉండడంతో పాటు రాష్ట్రంలో అనవసర ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

జర్నలిస్టు ఒక విశ్లేషణ చేస్తే అది ఆధారాలతో, నిజాలతో ఉండాలి. కానీ ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా విఫలమైందని చూపించేలా ఉన్నాయి. 200 మంది షార్ప్ షూటర్లు దేశంలోకి ప్రవేశించి, రాష్ట్రంలో తిరుగుతున్నారనుకుంటే అది పెద్ద భద్రతా సమస్య. కానీ ప్రభుత్వానికి, పోలీసులకు, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలకు అలాంటి సమాచారం లేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు, భయం పెరిగే అవకాశం ఉంది.

ఈయన చేసిన ఈ  200 మంది షార్ప్ షూటర్లు  వ్యాఖ్యలు  జనం లోకి బాగా  ప్రచారంలోకి వెళ్లడంతో,  సోషల్ మీడియా గ్రూపుల్లో ఆయన గురించే చర్చ జరుగుతోంది. అయితే ఆ జర్నలిస్ట్ ఎందుకు, ఆ విధంగా అలా చెప్పాడు  అనేది తెలియదు. కానీ వాస్తవానికి “నా దగ్గర ఆధారాలు ఉన్నాయి” అన్నాడు. ఆయన ఆధారాలు ఉంటే మరి ఆయన చేయాల్సింది ఏంటి? ఒకవేళ అలాంటి షార్ప్ షూటర్స్ వచ్చి ఉంటే , వెంటనే  ఆయన చేయాల్సిన  పని  ఏంటి? ముందు  మీడియాలో చెప్పడంతో పాటు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఆ పని చెయ్యలేదు, కేవలం తమ ఛానల్ లో ఆ వ్యాఖ్యలు ప్రసారం చేయడం తప్ప.  

పోలీసులు కేసు నమోదు – 41ఏ నోటీసులు

ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న  పోలీసులు పత్రి వాసుదేవన్‌పై కేసు నమోదు చేశారు. వర్గాల మధ్య ఘర్షణలు, అస్థిరత సృష్టించే విధంగా ఈ ప్రచారం ఉందని భావించి ఆయనను విచారణకు పిలిచారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. కానీ విచారణకు హాజరుకావడానికి బదులుగా వాసుదేవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఆయనను వెతుకుతున్నారు.

 

99 టీవీ యాజమాన్యం నిర్ణయం – ఉద్యోగం కోల్పోవడం

 

Journalist patri vasudevan was terminated from 99tv

ఆ తరువాత,    ఈ ఇష్యూ ను   ఛానల్ యాజమాన్యం కూడా సీరియస్‌గా తీసుకుంది . ఈ వాసుదేవన్ వ్యవహారం తమకు అప్రతిష తెచ్చేలా ఉందని భావించి, సంస్థ విశ్వసనీయత దెబ్బతినకుండా ఉండేందుకు పత్రి వాసుదేవన్‌ను, పొలిటికల్ ఎడిటర్ పదవి నుంచి, 99టీవీ  ఛానెల్ యాజమాన్యం,  99టీవీ నుండి తొలగించినట్టుగా ఆదేశాలు ఇచ్చారు, ఆ తొలగింపు  లేఖ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అది కూడా నిన్న 31వ తేదీ డేట్ తోటే ఉంది. ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయాలు, నిరాధార ఆరోపణలకు తమ ఛానల్ వేదిక కాదని , ఛానెల్ యాజమాన్యం  స్పష్టం చేసింది. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం  వెతుకుతున్నారు.    గతంలో ఆయన చేసిన వీడియోలు, వాటి వెనుక కారణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

జర్నలిజం పరిమితులు – విశ్లేషణ అంటే ఏమిటి?

జర్నలిస్టులు ఏదైనా విశ్లేషణ చేయాలంటే వాస్తవాలు, ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. ఒక వార్తా విశ్లేషణ కేవలం ఊహాజనితంగా, సెన్సేషన్ కోసం చేస్తే అది ప్రజలలో గందరగోళానికి దారితీస్తుంది. ప్రభుత్వం, పోలీస్ విభాగంపై విశ్వాసం తగ్గిపోతుంది. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఇలాంటి విపరీత పోకడలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి అనంటే మళ్ళీ దానికి కారణం రాజకీయాలే. రాజకీయ నాయకుల చేతుల్లో మీడియా యాజమాన్యాలు, పత్రికల యాజమాన్యాలు ఉండడం, రాజకీయ నాయకులే యజమానులుగా ఉండి నడపడం వల్ల ఇలాంటి విపరీత ధోరణలు. గతంలో రాజకీయ నాయకులు వాళ్ల సిద్ధాంత వ్యాప్తి చేయడం కోసం పత్రికలు, టీవీలు నడిపేవాళ్లు. కానీ ఇప్పుడు సిద్ధాంతాలు వ్యాప్తి కాదు — విష ప్రచారమే చేయడమే, అవతల వాళ్ల మీద విషం చిమ్మడమే లక్ష్యంగా పని చేస్తుంటే ఇది కచ్చితంగా విపరీత పోకడే. దీని మీద పోలీస్ శాఖ దృష్టి పెట్టాలి. కనీసం ఇప్పటికైనా చట్టబద్ధంగా శిక్షించడం ద్వారా ఇలాంటి విపరీత పోకడలకు చెక్ పెట్టే ప్రయత్నం ఒకటి జరగాలనే గట్టి ఆలోచనలో ఏపీ పోలీసులు ఉన్నారట. కచ్చితంగా జరగాలి. ఈ ఇలాంటి పరిణామం ఒకటి జరిగితే మంచిది.

వ్యూస్ కోసం తీవ్ర   వ్యాఖ్యలు 

సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ లో వ్యూస్, ఎంగేజ్మెంట్ కోసం కొంతమంది జర్నలిస్టులు హద్దులు దాటి, తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ అలా చేసినప్పుడు చివరికి చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. ఒక నెల క్రితం సాక్షి కొమ్మినేని కి, సాక్షి లో అమరావతి మహిళల పట్ల చేసిన అసభ్య వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణం రాజుకు ఏ గతి పట్టిందో చూసాము . ఇప్పుడు ఈ పత్రి వాసుదేవన్ చేసిన వ్యాఖ్యలుఫలితంగా ఆయనకు కూడా అదే గతి పట్టేటట్లుంది. ప్రస్తుతం ఆయన, 99టీవీ లో ఉద్యోగం కోల్పోయి, పోలీస్ విచారణను ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ భద్రతా చర్యలు – వాస్తవ పరిస్థితి

మాజీ సీఎం జగన్ కు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వం పటిష్టమైన భద్రతను కల్పిస్తోంది. గతంలో నెల్లూరులో జరిగిన ఒక పర్యటనలో సీఎంకు ఇచ్చే భద్రత కన్నా ఎక్కువ సెక్యూరిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాంటి పరిస్థితిలో ఆయన భద్రతను పట్టించుకోవడం లేదని చెప్పడం నిజానికి దూరంగా ఉన్న వ్యాఖ్య.

 

మీడియా విశ్వసనీయతను కాపాడుకోవడం

ఒక మీడియా సంస్థకు విశ్వసనీయతే పెద్ద సంపద. ఒక జర్నలిస్టు నిరాధార ఆరోపణలు చేస్తే ఆ సంస్థ మొత్తం ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే 99 టీవీ యాజమాన్యం త్వరగా చర్య తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన మార్గదర్శకాలు పెట్టే అవకాశం ఉంది.

 

భవిష్యత్తులో జర్నలిస్టులు పాటించాల్సిన జాగ్రత్తలు:

ఆధారాలతో విశ్లేషణ – ఎలాంటి విశ్లేషణ చేసినా వాస్తవాలపై ఆధారపడాలి.

సెన్సేషన్ తప్పించుకోవాలి – వ్యూస్ కోసం అతిశయోక్తి వ్యాఖ్యలు చేయరాదు.

ప్రభుత్వానికి సమాచారం అందించడం – ఏదైనా సీరియస్ సమాచారం ఉంటే ముందుగా అధికారులకు అందించాలి.

చట్టపరమైన అవగాహన – జర్నలిస్టులు చట్టపరమైన పరిధులను తెలుసుకోవాలి.

సమాజంలో శాంతి భద్రత కాపాడటం – విశ్లేషణలు సమాజంలో ఉద్రిక్తతలు రాకుండా ఉండేలా ఉండాలి.

పత్రి వాసుదేవన్ ఘటన జర్నలిజం రంగానికి ఒక పాఠం. మీడియా స్వేచ్ఛ ముఖ్యమే కానీ, అది బాధ్యతతో కూడినది కావాలి. నిరాధార ఆరోపణలు, విష ప్రచారం సమాజంలో అస్థిరతకు దారితీస్తాయి. చట్టపరమైన ఇబ్బందులు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఉద్యోగం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. భవిష్యత్తులో జర్నలిస్టులు, మీడియా సంస్థలు నిజాలను ఆధారంగా చేసుకొని విశ్లేషణలు చేస్తే మాత్రమే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, మీడియా గౌరవం నిలుస్తుంది.

 

 

One thought on “జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *