రాజధాని అమరావతిపై ఇటీవల కొన్ని మీడియా కార్యక్రమాల్లో చేసిన అసభ్య వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పత్రికా వ్యవస్థకు చెందిన ఇద్దరు ప్రముఖులు — వివిఆర్ కృష్ణంరాజు మరియు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు — అమరావతిని “వేశ్యల రాజధాని”గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ వ్యాఖ్యలతో తీవ్రంగా బాధపడిన అమరావతి మహిళలు నిరసనలు ప్రారంభించారు. పలు సామాజిక, మీడియా సంఘాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. ముఖ్యంగా ఏపీయూడబ్ల్యూజే, విజయవాడ ప్రెస్ క్లబ్, సామ్నా రాష్ట్ర కార్యవర్గం, మరియు బహుజన ఐకాస తరఫున సమగ్రంగా స్పందించారు.
బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు పత్రికా స్వేచ్ఛ పేరుతో చేస్తున్న బూతుప్రచారంగా పేర్కొన్నారు. కృష్ణంరాజు, కొమ్మినేనిలను తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రజా రాజధాని అమరావతి పై అవమానకరమైన విమర్శలు అని అభివర్ణించారు.
ఇటీవలి కాలంలో అమరావతిపై చేసిన అసత్య వ్యాఖ్యలపై ఇప్పటికే వేదన వ్యక్తమవుతోందని, అయితే ఇటువంటి వ్యక్తులు మహిళల పరువు నాశనం చేసేలా మాట్లాడడం శాసనరీత్యా శిక్షార్హం కావాలన్నారు.
కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు జర్నలిస్టుల నియమావళికి పూర్తిగా విరుద్ధమని, ఆయన మీడియా వృత్తికి అపకీర్తి తీసుకువస్తున్నారని పలు సంఘాలు పేర్కొన్నాయి. అమరావతిలో నివసించే మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు.
ఈ వివాదం పత్రికా స్వేచ్ఛ వాడకాన్ని గురించి పెద్ద చర్చకు దారితీసింది. వ్యక్తిగతంగా, సమాజంలో గౌరవించదగిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవే కాక, న్యాయపరంగా కూడా చర్యలుకు లోబడి ఉండేలా ఉన్నాయి.
మహిళల అవమానాన్ని చరిత్ర మరిచిపోదు: జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించిన ఆయన, “మహిళలను తక్కువచేసే వాళ్లను చరిత్ర మర్చిపోదు. వారి పేర్లు కాలగర్భంలో కలిసిపోతాయి” అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
“మీ మీడియా ద్వారా మహిళలపై ఈ స్థాయిలో దూషణలు చేయాలా?” అంటూ నిలదీశారు లోకేష్. అమరావతి గురించి జగన్ ప్రభుత్వం అవాస్తవ ప్రచారం చేస్తున్న తీరును ‘హేయమైన కుట్ర’గా అభివర్ణించారు. మహిళల గౌరవాన్ని చిన్నచేస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. “ఆకాశం వైపు ఉమ్మితే అది తిరిగి ముఖానపడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్‌ను తాకకముందు ఆగదు” అని ధ్వజమెత్తారు.
అమరావతిని “దేవతల రాజధాని”గా పేర్కొన్న లోకేష్, “అక్కడ భూములను త్యాగం చేసిన అమ్మల ఋణం మనం ఎలా మరచిపోతాం?” అంటూ ఉద్వేగభరితంగా స్పందించారు. మూడు రాజధానుల యోజనను కుట్రగా అభివర్ణిస్తూ, అలాంటి కుట్రలు కుట్రకర్తల మనస్సాక్షిని తొలగిస్తాయని వ్యాఖ్యానించారు. “అమరావతిని రాజధానిగా నిలబెట్టాలన్న ప్రజల సంకల్పం పవిత్రమైనది” అని అన్నారు.
జగన్‌ను “సైతాన్”గా పేర్కొంటూ, “తల్లి, చెల్లెలు అనే బంధాలను గౌరవించని వాడికి మహిళల గొప్పతనం ఏమాత్రం అర్థం కాదు” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలపై అనుచితంగా వ్యాఖ్యానించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
“మేము విద్యార్థిదశ నుంచే మహిళల పట్ల గౌరవం కలిగేలా సంస్కారం నేర్పుతున్నాం. మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే వారిని ఏ మాత్రం ఉపేక్షించము. చీరలు, గాజులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదు” అంటూ స్పష్టం చేశారు.
జగన్ గ్యాంగ్ మహిళలను కించపరిచేలా మాట్లాడిందని ఆరోపించిన లోకేష్, “అవాటి కోసం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే మహిళల హక్కులను రక్షించే ఉద్యమం మరింత తీవ్రతరమవుతుంది” అని హెచ్చరించారు.
“అమరావతి దేవతల రాజధాని – జగన్ లాంటి దెయ్యాలకు అక్కడ చోటు లేదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు లోకేష్.
తాజాగా ఈ వివాదంలోకి సజ్జల రామకృష్ణ రెడ్డి దూరాడు.
మీడియా తో మాట్లాడుతూ, మహిళలను వేశ్యలతో పోల్చిన జర్నలిస్ట్ కృష్ణంరాజు కి, మద్దతుగా మాట్లాడటమే కాకుండా, ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించిన అమరావతి ప్రాంత మహిళలను “రాక్షసులు”, “పిశాచులు”, “సంకర తెగ” అంటూ తీవ్రంగా దూషించాడు.
ఈ అనుచిత వ్యాఖ్యల ప్రస్తావనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త దుమారం రేగింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో, మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయాన్ని కలిసి రాజధాని ప్రాంత మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సజ్జల వ్యాఖ్యల పై, మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని, ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక మహిళలపై దుష్ప్రచారం జరుగుతోందని వారు మండిపడ్డారు.
మహిళా కమిషన్ స్పందన: సజ్జలకు నోటీసులు
అమరావతి ప్రాంత మహిళల నిరసనపై, తక్కువగా మాట్లాడడమే కాకుండా, “రాక్షసులు”, “పిశాచులు”, “సంకర జాతి” వంటి పదాలను ఉపయోగించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు జారీ చేస్తున్నట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రకటించారు. సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సజ్జల వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆమె పేర్కొన్నారు.
వైసీపీ 11 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితికి మహిళలే కారణమని భావించి, వారిపై కక్షతో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు రాయపాటి శైలజ తెలిపారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు మహిళల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కూడా సజ్జల అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు
మహిళలను లక్ష్యంగా చేసుకుని, సజ్జల అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ, రాష్ట్ర డీజీపీకి, రఘురామ అధికారిక ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేనివని మండిపడ్డారు.