తెలుగుదేశం పార్టీ (TDP) కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న గవర్నర్ పదవి చివరికి దక్కింది.
టీడీపీకి పదవి రాబోతోందన్న ప్రచారం చాలా కాలం నుంచి సాగుతోంది. చివరికి అనుభవం ఉన్న, పార్టీకి నిబద్ధతతో పని చేసిన నాయకుడైన అశోక్ గజపతిరాజుకు గౌరవమైన స్థానం లభించడంతో పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు గారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవా గవర్నర్గా నియమించారు. ఆయనకు తోడు హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అశీం కుమార్ ఘోష్, లద్దాక్కు కవీందర్ గుప్తాను నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
2024 తర్వాత కీలక రాజకీయ విజయంగా చెప్పుకోదగ్గ ఈ పరిణామం, టీడీపీకి పెద్ద గుర్తింపుగా నిలిచింది.
అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రస్థానం – విశ్వసనీయతకు నిదర్శనం
అశోక్ గజపతిరాజు గారు దాదాపు 25 సంవత్సరాలు శాసనసభ సభ్యుడిగా, 13 సంవత్సరాల పాటు మంత్రిగా, అలాగే 2014–2018 మధ్యకాలంలో కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిగా సేవలందించారు. 2024 ఎన్నికల తర్వాత అశోక్ గజపతి రాజు, రాజకీయాల నుంచి విరమించినప్పటికీ, కుమార్తె అదితి విజయలక్ష్మి కి ఎమ్మెల్యే స్థానం తో పాటు అశోక్ గజపతి రాజుకు కు, కూడా గౌరవ స్థానాన్ని ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు కు ఉండేది.
కేంద్రంతో టీడీపీ చర్చలు – గవర్నర్ పదవి దిశగా ముందడుగు
చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ పదవి విషయమై కేంద్ర నాయకులతో ఎన్నో చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. చివరికి ఈ పదవి అశోక్ గజపతిరాజుకు దక్కటం, టీడీపీకి కొత్త ఉత్సాహం నింపింది.
ఇక ఇతర ఏ తెలుగు నాయకులు గవర్నర్ స్థానాల్లో కొనసాగుతున్నారు అన్నది చూస్తే
తెలుగు నాయకులు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల్లో ఉన్నారు:
బండారు దత్తాత్రేయ – 2021లో హర్యానా గవర్నర్గా, అనంతరం మిజోరం గవర్నర్గా.
కంభంపాటి హరిబాబు – ప్రస్తుతం ఒడిశా గవర్నర్గా.
ఎన్. ఇంద్రసేనారెడ్డి – మిజోరం గవర్నర్గా కొనసాగుతున్నారు.
ఇంకా, బీజేపీలో చేరిన కొందరు ప్రముఖ బ్యూరోక్రాట్లు — ఐవైఆర్ కృష్ణారావు, దినేష్ రెడ్డి — ఇప్పటికీ పదవులు పొందకపోవడం గమనార్హం.
పార్టీకి గౌరవంగా వచ్చిన గవర్నర్ పదవి
ఈ నేపధ్యంలో అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ పదవి రావడం టీడీపీకి గౌరవంగా మాత్రమే కాదు, భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా కూడా నిలవనుంది. అదే సమయంలో, బండారు దత్తాత్రేయ గారి పదవి విరమణ, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడం మరో కీలక సంఘటనగా చెబుతున్నారు.