వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

 

 

 

 

 

 

 

 

వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది.

దేనికి ?

1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తోట త్రిమూర్తులు రామచంద్రపురం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 1995 లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2004 లో ఓడిపోయాడు. 2008 లో టీడీపీ కి రాజీనామా చేసి, 2008 లో ప్రజారాజ్యం పార్టీ లో చేరాడు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయాడు. 2014 లో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచాడు, మళ్ళా 2019 లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2019 లో టీడీపీ కి రాజీనామా చేసి, వైసీపీ లో చేరాడు. వైసీపీ లో అతనికి ఎమ్మెల్సీ వచ్చింది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నాడు.

 

 

 

 

 

 

ఇదీ అతని పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్.

అయితే ఇప్పుడు ఈ కేసు ఏమిటి?

1996, డిసెంబ‌ర్ 29న వెంక‌టాయ‌పాలెంలో ఈ శిరోముండ‌నం జ‌రిగింది. ఆనాడు ఎన్నిక‌ల్లో తోట త్రిమూర్తులు వ‌ర్గం బూత్ లో రిగ్గింగ్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే, అడ్డుకున్నందుకు త‌మ‌పై కోపం పెట్టుకొని తోట త్రిమూర్తులు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఐదుగురిని హింసించి, ఇద్ద‌రికి గుండు కొట్టించి… క‌నుబొమ్మ‌లు గీయించార‌ని కేసు న‌మోదైంది.

1994లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తోట త్రిమూర్తులు రామ‌చంద్రాపురం ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో బీఎస్సీ త‌ర‌ఫున పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న ఇద్దరితో తోట త్రిమూర్తులు కుటుంబ స‌భ్యుల‌కు వాగ్వాదం జరిగింది. త్రిమూర్తుల వర్గం రిగ్గింగ్ చేయాల‌ని భావిస్తే, తాము అడ్డుకున్నామ‌ని ఆ క‌క్ష‌తోనే త‌మ‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించార‌ని, 1996 డిసెంబ‌ర్ లో శిరోముండ‌నం చేశార‌ని బాధితులు ఆరోప‌ణ‌.

విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టులో 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడిన తరువాత ఈ రోజు ఈ కేసులో తోట త్రిమూర్తులుకు 18నెల‌ల జైలుశిక్ష‌తో పాటు రూ.2ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. అలాగే మరో సెక్షన్ కింద ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు లక్షా 50 వేల జరిమానాను అట్రాసిటీ కోర్టు విధించింది. ఈ కేసులో మొత్తం 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది.

శిక్ష విధించే ముందు మీరేమైనా చెప్ప‌ద‌ల్చుకున్నారా అని త్రిమూర్తులను న్యాయ‌మూర్తి అడ‌గ్గా… న‌న్ను రాజ‌కీయం దెబ్బ‌తీసేందుకే నా మీద కేసు పెట్టారు, ఇన్ని సంవ‌త్స‌రాలుగా ఎంతో మనోవేధ‌న‌ను అనుభవించాను, 87 రోజుల పాటు రిమాండ్ లో కూడా వున్నానని అన్నట్టు తెలిసింది.

28 ఏళ్ళ తరువాత తమకు న్యాయం జరిగింది అని బాధితులైన దళితులు మీడియా తో మాట్లాడుతూ, పొందిన సంతోషం , తీర్పు వచ్చిన కొద్దీ గంటల్లోనే వారి సంతోషం ఆవిరి అయిపోయింది. కోర్ట్ త్రిమూర్తులకు, బెయిల్ ఇచ్చింది.

అయితే ఈ కేసులో సస్పెన్షన్ ఆఫ్ జడ్జిమెంట్, బెయిల్ కోసం వ్యక్తిగత పూచీతో పాటు బెయిల్‌కోసం త్రిమూర్తులు, సహ నిందితులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు పై హై కోర్ట్ లో అప్పీల్ చేస్తానని త్రిమూర్తులు చెప్పారు.

ఎంతో త్వరగా బాధితులకు న్యాయం జరిగింది అని నెటిజన్లు సెటైర్లు వేసే లోపు, ఆ నిందితులకు బెయిల్ కూడా వచ్చేసింది.

కొసమెరుపు: త్రిమూర్తులకు శిక్ష పడ్డ అంశంపై, ఈ రాజకీయ పార్టీ కూడా , పెద్దగా ప్రతిస్పందించలేదు, మీడియా ఎదురుగా రాలేదు. ఎందుకంటే, త్రిమూర్తులు గత 25 ఏళ్లుగా అన్ని పార్టీ ల్లోనూ వున్నాడు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *