18th May 2025
నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిశారు.17th May సాయంత్రం లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీకి చేరుకున్నారు. అనంతరం, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని అమరావతిలో పర్యటించిన విషయం విదితమే. ఆ పర్యటన సందర్భంగా, నారా లోకేశ్‌ను దిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా ప్రధాని సూచించారు.
. లోకేష్ కుటుంబాన్ని ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్న మోడీ వారితో దాదాపు గంటన్నర సేపు గడిపారు. లోకేష్ కుమారుడు దేవాన్ష్ ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. బ్రహ్మణి, లోకేష్ లను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ భేటీలో ప్రధాని, లోకేష్ మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది ఎన్నికలకు ముందు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంబంధించిన వివరాలు, విశేషాలతో కూడిన కాఫీ టేబుల్ బుక్ ను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించి తొలి కాపీ అందుకున్నారు. అంతే కాదు.. ఆ పుస్తకంపై తాను సంతకం చేసి మరీ లోకేష్ కు అందించి మరుపురాని ఆత్మీయ జ్ణాపకాన్ని పంచారు. లోకేష్, బ్రహ్మణి, దేవాన్ష్ లకు మోడీ ఆశీస్సులు అందజేశారు.
నారా లోకేష్ రాష్ట్రప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలను మోడీ దృష్టికి తీసుకువచ్చి సహకారం కోరారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందిస్తుందని, అందుకు మోడీ దిశానిర్దేశం అవసరమనీ కోరారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలన, అభివృద్ధి తదితర అంశాలను లోకేష్ ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. లోకేష్ వినతులన్నిటికీ ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ భేటీ ప్రధాని మోడీ, లోకేష్ మధ్య ఉన్న అనుబంధం రాజకీయాలకు మించి అన్న సందేశాన్ని చాటింది.
ఇక ప్రధాని మోడీని కుటుంబంతో కలిసే అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానంటూ లోకేష్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా పెట్టిన పోస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ పురోగతికి ప్రధానమంత్రి అందించిన మద్దతుకు కృతజ్ఞతలు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వానికి ధన్యవాదాలు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో రాష్ట్రం దేశానికి ఏ విధంగా తోడ్పడాలో ప్రధాని నుంచి సలహాలు తీసుకున్నానంటూ ట్వీట్ చేశారు.