2nd March 2025
చింత పండు నవీన్, ఈ పేరు చెబితే చాలా మందికి తెలియదు, తీన్మార్ మల్లన్న అంటే అందరికీ తెలుస్తుంది.
TV5 ఛానల్ లో , తీన్మార్ మల్లన్న అనే ప్రోగ్రాం ద్వారా, తెలంగాణ యాస లో, ఈ నవీన్ చెప్పే ముచ్చట్లతో , ఆయనకు మంచి పబ్లిసిటీ వచ్చింది, తీనామర్ మల్లన్నగా పాపులర్ అయ్యాడు ( ఏ TV5 ఛానెల్ లో అయితే, తనకు గుర్తిపు వచ్చిందో అదే ఛానెల్ , ను ఇప్పుడు విమర్శించడం కొసమెరుపు ).
జర్నలిస్టుగా మొదలై, TV5 లో తీన్మార్ మల్లన్న ప్రోగ్రాం లో సక్సెస్ అయి, తరువాత రాజకీయ వేత్తగా మారి , Q న్యూస్ , అనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి, ఛానల్ ను పాపులర్ చేసాడు.
గత 5 ఏళ్ళు, BRS (అప్పట్లో TRS ), KCR మీద ఆ పార్టీ విధానాల మీద పోరాడేవాడు, ఒకరకంగా విరుచుకుపడేవాడు. అప్పటి KCR ప్రభుత్వం ఈయన మీద అనేక కేసులు పెట్టింది, అతని స్టూడియో మీద దాడులు కూడా జరిగాయి. అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, అయినా వెనుతిరగకుండా KCR మీద, తన Q న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా, పోరాడాడు.
మొదటిసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయినా రెండో స్థానం లో నిలిచి సంచలనం సృష్టించాడు. KCR , BRS దాడులు తట్టుకోడానికి, 2021లో బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీ లో ఎక్కువకాలం వుండలేదు.
2023లో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు .
2023 లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత, రేవంత్ రెడ్డి ఆశీస్సులతో, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2024లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు శాసన మండలి లో అడుగుపెట్టాడు.
మొదట్లో కాంగ్రెస్ పార్టీ లో మామూలుగానే వున్నా, తరువాత తరువాత మెల్ల మెల్లగా కాంగ్రెస్ పార్టీ విధానాలను విమర్శించడం మొదలుపెట్టాడు.
అయితే, రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే తరువాత, తన విమర్శలను తీవ్రతరం చేసాడు.
బీసీ కులగణన సరిగ్గా నిర్వహించలేదని, అనేక లక్షల మంది బీసీ లను, ఆ జాబితాలో లేకుండా వెళ్ళగొట్టారని, తీవ్ర విమర్శలు చేసాడు.
అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన ఆ కులగణన కాగితాన్ని , తన ఛానెల్ ప్రోగ్రాం లో కాల్చాడు, అది కాంగ్రెస్ పెద్దల ఆగ్రహానికి కారణమయ్యింది.
దానికి తోడు, తెలంగాణ కు బీసీ నే సీఎం కావాలని, రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణాకు ఆఖరి రెడ్డి సీఎం అని చెప్పడమే కాకుండా, బీసీలతో నిర్వహించిన పెద్ద బహిరంగ సభలో, రెడ్డి సామాజికవర్గాన్ని తీవ్రంగా విమర్శించాడు.
అయితే కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, మల్లన్న పై ఎదురుదాడి చేసారు. అతనికి దమ్మువుంటే కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ కి రాజీనామా చేసి, మళ్ళా పోటీ చేసి గెలవాలని సవాల్ చేసారు, బీసీ ల ఉద్యమం ముసుగులో, సీఎం కాయడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శలు గుప్పించారు.
మల్లన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో ఆగ్రహించిన కాంగ్రెస్ పెద్దలు, ” కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే పేపర్ ను బహిరంగంగా తగలబెట్టడం, పార్టీ ధిక్కరణ క్రిందే వస్తుందని” దీనికి సంజాయిషీ చెప్పాలని షో కాజ్ నోటీసు పంపారు.
మల్లన్న , ఆ నోటీసును ఖాతరు చెయ్యలేదు, దానికి జవాబివ్వలేదు.
ఈ చర్యతో మరింత ఆగ్రహించిన , కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ, తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మల్లన్న చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలని జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎలాంటి వివరణ రాలేదని..స్పందించలేదని అందుకే సస్పెండ్ చేస్తున్నామని”, చిన్నారెడ్డి పేరుతో జారీ అయిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ తెలంగాణ పర్యటనకు వచ్చిన మరుసటి రోజే తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ క్రమశిక్షణ గీత దాటితో వేటు ఖాయమన్న సంకేతాన్ని నటరాజన్ ఈ విధంగా ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తనంతట తాను పార్టీ లోనుండి బయటికి పోకుండా, ఈ సస్పెన్షన్ ద్వారా బయటకు వెళ్లిపోవాలనే మల్లన్నకు ఉందని, అందువల్లే , షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వలేదని, ఈ సస్పెన్షన్ చర్య ద్వారా తనకు , బీసీలలో, మంచి మైలేజి , సానుభూతి వస్తుందని, మల్లన్న వ్యూహం అని రాజకీయ విశ్లేషకులు తమ డిబేట్ లలో చెప్పారు.
ఇక మల్లన్న కొత్త పార్టీ పెడతాడా, 2028 తెలంగాణా ఎన్నికల్లో, అసెంబ్లీ కి పోటీ చేస్తాడా అన్నది వేచి చూడాలి.