12th May 2025
కింగ్ అని పిలుచుకునే కోహ్లీ, రోహిత్ బాటలోనే నడిచాడు, అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి, క్రికెట్ ప్రపంచానికి, అభిమానులకు షాక్ ఇచ్చాడు.
రోహిత్ రిటైర్ అయిన తరువాత, కోహ్లీ కూడా రిటైర్ అవుతున్నట్టు గత రెండు రోజులుగా ఊహాగానాలను వస్తున్న వేళ, సీనియర్ భారత్ క్రికెటర్లు ,ఇంగ్లాండ్ పర్యటన సమయంలో, కోహ్లీ రిటైర్ అవ్వకూడదని, యువకులతో కూడిన జట్టుకు మెంటర్ గా ఉండాలని సలహా
ఇచ్చారు. ఆ సలహా పాటించకుండా, తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు.
36 ఏళ్ళ వయసు పూర్తి చేసుకున్నకోహ్లీ, ఇంకో 2 ఏళ్ళు టెస్టులకు ఆడే చాన్సు ఉందని అందరు భావించారు కానీ, ఇక చాలు అని కోహ్లీ నిర్ణయం తీసుకుని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
గత సంవత్సరమే, అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడం, ఇప్పుడు టెస్టులకు కూడా వీడ్కోలు చెప్పడంతో, ఇక కేవలం వన్డేల్లోనే కోహ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే కొన్ని గంటల ముందు కోహ్లీ, అనుష్క శర్మలు ముంబై ఎయిర్ పోర్ట్‌లో కనిపించారు. కోహ్లీ నవ్వుతూ కనిపించారు. రిటైర్మెంట్ ప్రకటించే ముందు కోహ్లీ ముఖంలో ఎటువంటి బాధ కనిపించడం గమనార్షం.
సీని యర్లకు ‘చీకూ’గా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులు కింగ్ గా పిలుచుకునే కోహ్లీ, మైదానంలో ఉంటే, ఎంతో ఉత్సహంతో వుండే కోహ్లీ, భారత క్రికెట్లో అంతర్భాగమైన కోహ్లిని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితే. అది పూడ్చలేనిది.
2024 లో T20 వరల్డ్ కప్ ఫైనల్ లో, సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ లో 70 పరుగులు చేసి, కప్పు గెలుచుకోవోడం లో ప్రధాన భూమిక వహించాడు. మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణించాడు.
ఇంకో 770 పరుగులు చేసి, 10,000 పరుగులు చేసి రిటైర్ అవ్వాల్సింది అని అభిమానులు భావిస్తున్నారు . అయితే, ఈ మధ్య కాలంలో టెస్టుల్లో, విరాట్ ఫామ్ లో లేడు . గత 5 ఏళ్లలో టెస్ట్ క్రికెట్ లో, కోహ్లీ యావరేజ్ 30 కు పడిపోయింది.
తన ఆఖరి ఆస్ట్రేలియా సిరీస్ లో మొదటి టెస్టుల్లో సెంచరీ చేసినా, మిగతా 4 టెస్టుల్లో అంతగా రాణించకపోవడంతో, విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఈ జూన్ లో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ లో , ఇంగ్లాండ్ పేస్ పిచ్ ల పై పరుగులు చేయగలనా అని అనుమానం వచ్చి ఉంటుంది. అక్కడ ఫెయిల్ అయి, అభిమానులచేత విమర్శలు ,తిట్లు పొంది, అప్పుడు రిటైర్ అవడం ఎందుకు, ముందుగానే హుందా గా రిటైర్ అవ్వాలని అనుకున్నాడేమో.
అయితే, కోహ్లీ రిటైర్మెంట్ కు కారణం కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా కారణం అని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఇంగ్లాండ్ సిరీస్ లో తనను కెప్టెన్ గా చెయ్యమని, కోహ్లీ కోరాడని, దానికి, గంభీర్, అగార్కర్ నిరాకరించారని, దాని కారణంగానే కోహ్లీ , టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ , అకస్మాత్తుగా , ఇంగ్లాండ్ పర్యటనకు ముందే ప్రకటించాడనే వార్తలు వస్తున్నాయి, కానీ అవి నమ్మదగ్గవిగా లేవు.
2014 డిసెంబర్..నుండి టెస్ట్ క్రికెట్ లో ఆడుతున్న కోహ్లీ ఇప్పుడు రిటైర్ అయ్యేదాకా చూసుకుంటే, కోహ్లీ టెస్ట్ గణాంకాలు ఇలా వున్నాయి.
టెస్ట్ కెప్టెన్‌గా అయిన తర్వాత.. ప్రపంచ క్రికెట్‌లో, 2017 నుంచి 2021 వరకు ఐదేళ్లు టీమిండియాను నెంబర్ వన్‌గా నిలబెట్టాడు. భారత్ ను వరుసగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
కోహ్లీ సారథ్యంలో భారత్ 68 మ్యాచ్‌లు ఆడి.. 40 విజయాలు సాధించింది. మరో 11 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై 11 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గానూ రికార్డు విరాట్ కోహ్లీ పేరుమీదే ఉంది.
కోహ్లీ సారథ్యంలో విదేశాల్లో భారత్.. 15 విజయాలు నమోదు చేసింది. కెప్టెన్‌గా వరుసగా అత్యధికంగా 9 టెస్ట్ సిరీస్ గెలిచింది కూడా కోహ్లీనే.ఆస్ట్రేలియాను వాళ్ల సొంతగడ్డపైనే వారిని ఓడించి .. వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను గెలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా టెస్ట్ జట్టును ఊహించుకోవడం చాలా కష్టం. కెప్టెన్‌గా తాను 2022లో రిటైర్ అయినా.. తరువాత కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు అవసరమైనపుడు మంచి సలహాలు ఇస్తూండేవాడు.
కోహ్లీ లోటు పూడ్చలేనిది, భారత్ క్రికెట్ లో కోహ్లీ ఎరా ముగిసినట్లే.