18th May 2025
భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేసి, భారత దేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది. డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.
ఇప్పటి వరకు పాక్ కోసం పని చేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారులు బయటపడ్డారు. భారత్, పాక్ యుద్ధం తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు, ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావటం గమనార్హం. ఆ 11 మంది గురించిన వివరాల్లోకి వెళితే..
జ్యోతి మల్హోత్రా
జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిసర్. 33 ఏళ్ళ జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పని చేయటం మొదలెట్టింది.
దేవేంద్ర సింగ్ దిల్హన్
పంజాబ్‌లోని మస్త్‌ఘర్‌కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పాటియాల లోని ఖల్స కాలేజీలో ఎమ్‌ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐలతో పరిచయం అయింది. అప్పటినుంచి భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడు. మే 12వ తేదీన తన ఫేస్‌బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నుల ఫొటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పని చేసినట్లు ఒప్పుకున్నాడు.