మహాన్యూస్ టీవీ పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.
మహాన్యూస్ ఛానల్ ఆఫీస్ పై , బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు, దీనిలో భాగంగా, 20 కి పైగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు తలుపులు పగల కొట్టి , దౌర్జన్యంగా లోపలి ప్రవేశించారు, తరువాత , కార్లు, ఆఫీస్ ఫర్నిచర్ , ఆఫీస్, స్టూడియో అద్దాలు , ధ్వంసం చేసారు. దాడి చేస్తున్న ఈ బీఆర్‌ఎస్ కార్యకర్తలను మహాన్యూస్ ఉద్యోగులు అడ్డుకోబోతే, వారిని వెనక్కి నెట్టేసి, మహా న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రేగళ్ల వంశీ ప్రస్తుతం ఎక్కడున్నాడో చెప్పండి, అని ఉద్యోగులను అని బెదిరించినట్టు, మహాన్యూస్ ఉద్యోగులు తెలిపారు.
ఈ దాడికి వాళ్ళు చెప్పే కారణం , ఫోన్ టాపింగ్ ఇష్యూ లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై , గత కొన్ని రోజులుగా, మహా న్యూస్ , అసత్య కథనాలు ప్రసారం చేస్తోందని, కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తోందని.
ఒక ఉద్యమం నుండి తెరాస పార్టీ పుట్టింది, 10 ఏళ్ళు తెలంగాణా లో అధికారంలో వుంది.. అలాంటి పార్టీ జర్నలిజం పై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసానికి దిగడం కలవరపరిచే అంశం. అందుకే ఈ దాడి వార్తని నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా హైలైట్ చేసాయి. దేశంలోని ప్రత్రికా, టీవీ మీడియా వర్గాలు , ఈ దాడితో , దిగ్బ్రాంతికి గురయ్యాయి.
ఉద్యమం లో వున్నపుడు, తెరాస(బీఆర్‌ఎస్) మీడియా తో బాగానే ఉండేది, ఇప్పుడు ఆంధ్ర మీడియా లేదా ఆంధ్ర అనుకూల మీడియా అని ఏ ఛానల్స్ ను అయితే, తెరాస విమర్శిస్తుందో, అదే చానళ్ళు , బీఆర్‌ఎస్ నడుపున్న తెలంగాణ ఉద్యమాన్ని బాగా కవర్ చేసాయి, అదే టీవీ చానెళ్లు కెసిఆర్ తో సహా, అప్పటి తెరాస నాయకుల లైవ్ ఇంటర్వూస్, ఎన్నో ప్రసారం చేసాయి.
ఎప్పుడైతే తెరాస (ఇప్పుడు బీఆర్‌ఎస్ ), అధికారంలోకి వచ్చిందో, ఒక్కసారిగా వారి పంధా మార్చుకుంది. తమ ప్రభుత్వం మీద ఏ విమర్శ వచ్చినా సహించలేకపోయేవారు, తమను విమర్శించే మీడియా ను ఆంధ్ర మీడియా అని, చంద్రబాబు మీడియా అని దుయ్యబట్టేవారు. “బ్రతికేది తెలంగాణ లో, కానీ అనుకూలంగా వ్యవహరించేది ఆంధ్రాకు”, అని తెరాస నాయకులు పదే పదే ఎద్దేవా చేసేవారు. తెరాస పాలనను ఏ చానళ్ళు విమర్శిస్తే, అవి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు, జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేవారు. తెరాస పార్టీ ని, వారి పాలన లో లోపాలను విమర్శిస్తే, అది తెలంగాణ ను ఎలా విమర్శిస్తున్నట్టో అర్ధం కాదు, ఇదే విషయాన్ని , ABN రాధాకృష్ణ , ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే , లో , తెరాస నాయకురాలు, కవితను కూడా అడిగారు, తెరాస పార్టీ వేరు, తెలంగాణ వేరు, రెండింటినీ ఎలా ముడిపెడతారు అని.
అప్పట్లో, మీడియా పట్ల కెసిఆర్ వ్యతిరేకత ఎలా ఉండేది ?
టీవీ9 పై,
కెసిఆర్ 2014 లో మొదటిసారి సీఎం గా అయినపుడు , కొత్తగా అసెంబ్లీ కి ఎన్నికయిన కొంతమంది శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేసే సందర్భం లో పలికిన తప్పులను, భాష లోపాలను ఎత్తి చూపిస్తూ, యెగతాళి చేస్తూ, ఒక సెటైరికల్ కార్యక్రం టీవీ9 ప్రసారం చేస్తే, అసెంబ్లీ సాక్షిగా , కెసిఆర్ ,అసెంబ్లీ సాక్షిగా . తెలంగాణను సంస్కృతిని అవమానిస్తున్నారని , టీవీ 9 పై మండిపడ్డారు. అప్పుడు, కొన్నాళ్ళు, టీవీ ను బాన్ చేసినట్టు గుర్తు.
ABN , ఆంధ్రజ్యోతి పై,
ABN ఆంధ్రజ్యోతి ని విమర్శిస్తూ, కిలోమీటర్ గొయ్యి తీసి, దానిలో, ఆ మీడియాను బొంద పెడతామని ఒకసారి కెసిఆర్ హెచ్చరించారు . ఆంధ్రజ్యోతి కి యాడ్లు బంద్ చేసారు, కొన్నాళ్ళు ఆ ఛానల్ ను నిషేదించారు కూడా. కానీ, ABN రాధాకృష్ణ కూడా కెసిఆర్ అధికారంలో ఉన్నన్నాళ్ళు, కూడా , ఎక్కడా తలవొగ్గలేదు, బెదరలేదు, అది మాత్రం చెప్పుకుని తీరాలి.
తెలంగాణ ఎడిషన్ లలో, ఆంధ్ర ప్రాంతం న్యూస్ ఒక పేజీ వరకు మాత్రమే ఇచ్చినా కూడా, ఆంధ్ర న్యూస్ , ఇక్కడ పేపర్లలో ఎందుకు ప్రింట్ చేస్తున్నారని కూడా కెసిఆర్ తిట్టిపోసేవారు. అదేమీ వింత వాదనో అర్ధం కాదు. తెలంగాణ లో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి సెటిల్ అయిన వారు లక్షల్లో వుంటారు, వారికి , తమ ప్రాంతం లో ఏమి జరుగుతుందో తెలుకోవసిన అవసరం, ఆసక్తి ఉండవా ? ఈ లెక్కన ప్రతి రాష్ట్రంలోని న్యూస్ పేపర్లు , తమ రాష్ట్రం తప్ప , భారతదేశంలోని ఏ రాష్ట్రం యొక్క న్యూస్ ప్రచురించకూడదన్నమాట , కెసిఆర్ లెక్క ప్రకారం.
ఇప్పుడు తెరాస అధికారం కోల్పోయాక, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిస్తున్న ఫోన్ టాపింగ్ కేసు విచారణ లో, రాబిన్ ఛానల్ రాధాకృష్ణ ఫోన్ కూడా టాప్ చేశారనే వార్త తెలుస్తోంది.
కెసిఆర్ సీఎం గా వున్నపుడు నిర్వహించే, ప్రెస్ మీట్లలో ఎవరైనా ఇబ్బందికరమైన ప్రశ్న వేస్తె చాలు, ఏ పేపర్, ఏ ఛానల్ నీది, ఇదేనా మీకు ఇచ్చిన ట్రైనింగ్, అని బెదిరించేవారు.
ఇప్పుడు బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయాక :
ఇప్పుడు బీఆర్‌ఎస్అధికారం కోల్పోయాక కూడా, అదే ధోరణి… అదే ఫ్రస్ట్రేషన్ మీడియా మీద చూపడం… కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో, సీఎం రేవంత్ ను బూతులు తిట్టించడం, అలాంటి బూతులు తిట్టిన ఛానల్స్ పై కేసులు పెట్టి, వాళ్ళను అరెస్ట్ చేస్తే, ఆ ఛానల్స్ వారిని వెనకేసుకొని రావడం, చేసారు. … కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో కూడా AI ఇమేజెస్ సృష్టించి, ఎడిటడ్ వీడియోస్ తో, కాంగ్రెస్ ప్రభుత్వం పై, తప్పుడు వార్తలతో నెగెటివ్ కాంపైన్ నడిపారు, బీఆర్‌ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మహా న్యూస్ చానెల్ పై దాడి. మళ్ళీ ప్రజల మన్ననలను పొంది అధికారంలోకి వద్దామని చూస్తున్న బీఆర్‌ఎస్, ఇలాంటి చర్యలతో , ప్రజలలో వ్యతిరేక భావం పెంచుకుని, ఎలా అధికారంలోకి వద్దామనుఉంటుందో తెలియదు.
మహా న్యూస్ లో కేటీఆర్ పై వార్తల్లో నిజమెంత ?
అయితే, ఇక్కడ మహా న్యూస్ కూడా కొంత పరిధి కూడా దాటింది అని చెప్పాలి. ఫోన్ టాపింగ్ కేసు లో కేటీఆర్ గురించి, వారి ఛానల్ లో, ఈ నేరం ఎలా జరిగింది?అని వీడియో లు పెడుతున్నారు, అయితే, కొన్ని వీడియో లకు, మహా న్యూస్ పెట్టిన థంబ్ నెయిల్స్ చాలా అభ్యంతరకరంగా వున్నాయి. కేటీఆర్ వ్యక్త్తిగత్ ప్రతిష్టను దెబ్బతీసేలా వున్నాయి. తమ దగ్గర ఏ రుజువులు లేకుండా, కేటీఆర్ పై, అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ తో ,ఎలా వీడియో లు వారి ఛానల్ లో ఉంచుతారు? అది హర్షణీయం కాదు. వారు కూడా కొన్ని ఎథిక్స్ పాటించవలిసింది.
అయితే, మహా న్యూస్ ,తమ నేత పట్ల , తప్పుడు థంబ్ నెయిల్స్ తో వీడియో లు పెట్టిందని, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఏకంగా ఛానల్ ఆఫీస్ పై దాడికి వెళ్ళిపోతారా ? ఛానల్ తప్పు చేస్తే, వారు, ఆ ఛానల్ బయట ధర్నా చేయచ్చు, లీగల్ గా కోర్ట్ లో పరువునష్టం దావా వెయ్యచ్చు. అంతే కానీ, భౌతికంగా దాడులు ఎలా చేస్తారు ? ఇప్పుడు ఈ దాడులకు పురిగొల్పింది పై స్థాయి నాయకులు బాగానే వుంటారు, కానీ, ఈ చర్యకు పాల్పడిన క్రింద స్థాయి కార్యకర్తలు మాత్రం జైలు కు పోవాల్సి ఉంటుంది, ఈ కార్యకర్తలు కూడా , ఈ వాస్తవాన్ని గ్రహించాలి.