వైసీపీ కి అధికారం పోయిన తరువాత, కొద్ది నెలలనుండీ , సాక్షి మీడియా లో హటాత్ పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. టిడిపి కోటి సభ్యత్వాలు సాధించిన సందర్భంగా చంద్రబాబు, లోకేష్ ను అభినందిస్తూ , వారి ఫోటో లతో కూడిన పూర్తి పేజీ ప్రకటన సాక్షి మొదటి పేజీ లో రావడంతో, అందరూ నివ్వెరబోయారు. వైసీపీ అభిమనులైతే, డబ్బు కోసం ఏమైనా చేస్తారా అని సాక్షి ని ప్రశ్నిస్తున్నారు. అలాగే సాక్షి లో ఎప్పుడు ఎవర్ని తీసేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడివ్యక్తుల మధ్య ఆధిపత్య పోరాటాల కారణంగా సంస్థ పని తీరు రోజు రోజుకు మసకబారుతోంది. తాజాగా భారతిరెడ్డి తరపున ప్రతినిధిగా సంస్థల్ని నిర్వహించే రాణి రెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ ను తొలగించినట్టు, మీడియా సర్కిల్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి . ఇక ఆఫీసుకు రావొద్దని ఆమెకు సమాచారం ఇచ్చినట్లుగా సాక్షి వర్గాలు చెబుతున్నాయి.
భారతి రెడ్డికి బంధువుతో పాటు ఫ్రెండ్ లాంటి రాణి రెడ్డి చాలా కాలంగా సాక్షి మీడియా లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. . ఆమె చెప్పేది మాత్రమే భారతి వింటారు. అందుకే ఆమెకు సాక్షి లో అజమాయిషీ చేసే అవకాశం దక్కింది అంటారు. ఆమె ప్రత్యేకంగా తన వర్గం అనుకునేవారిని పెంచి పోషించిందని అంటారు. ఇష్టం లేని వారిని సాగనంపడానికి ప్రత్యేకమైన వ్యూహాలు పాటించేవారు. అందుకే అంతా ఆమె చెప్పినట్లుగా వినేవారు అక్కడ ఉన్నారు. పై స్థాయిలో రాణిరెడ్డి తీరుపై అసంతృప్తి ఉంది. కానీ ఎవరూ ఫిర్యాదులు చేసేంత సాహసం కూడా చేసేవారు కాదు.
రాణి రెడ్డిని తొలగించాలని నిర్ణయించిన తరువాత ఆమెకు రెండు నెలల నోటీసు ఇచ్చారు. నోటీసు సమయంలో కూడా ఆఫీసు కు రావాల్సిన అవసరం లేదని.. సంస్థ వ్యవహారాల్లో ఇక జోక్యం అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా ఎందుకు అన్నది చాలా మందికి అర్థం కాని విషయంగా మారింది.