అప్పుడు బండి సంజయ్, ఇప్పుడు అన్నామలై…

Then Bandi Sanjay, now Annamalai...

6th April 2025

తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల కు 3 ఏళ్ళ ముందు తెలంగాణ బీజేపీ ఊసు ఎక్కడా లేదు, 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న ఆశ కూడా లేదు. అప్పుడు కేంద్ర బీజేపీ అధిష్టానం, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, అప్పుడు ఎంపీ గా వున్న, బండి సంజయ్ ని నియమించింది. అప్పుడు బండి సంజయ్ దూకుడుకి, తెలంగాణ బీజేపీ , రేస్ లో పరిగెత్తింది.

బండి సంజయ్ అప్పటి BRS ప్రభుత్వం మీద దూకుడుగా పోరాడాడు, ఎప్పటికప్పుడు, BRS విమర్శలు ధీటుగా కౌంటర్ లు ఇస్తూ, బీజేపీ కి ఒక ఊపు తెచ్చాడు, కేసు లు కూడా ఎదుర్కొని, జైలు కు వెళ్ళొచ్చాడు. ఆ ఊపు లో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించాడు, GHMC ఎన్నికల్లో కూడా బీజేపీ కి బాగానే కార్పొరేటర్ల స్థానాలు వచ్చాయి. ఇక 2023 ఎన్నికల్లో, BRS కు , కాంగ్రెస్ కన్నా, బీజేపీ నే ప్రధాన ప్రత్యర్థి అని ప్రజలలో ఆలోచనను, నమ్మకాన్ని రేకెత్తించాడు.

అప్పుడు కనుక బండి సంజయే, బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే, తెలంగాణ లో బీజేపీ నే అధికారంలోకి వచ్చేదేమో, ఒక వేళ రాకపోయినా, బీజేపీ ,రెండో స్థానంలో నిలిచి, చెప్పుకోదగ్గ స్థానాలు గెలిచేదేమో. కానీ ఏమైంది, కేంద్ర బీజేపీ , ఏ వ్యూహంతో , ఎందుకు, ఎలా ఆలోచించేదేమో తెలియదు కానీ, అకస్మాత్తుగా బండి సంజయ్ ను , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డి ని నియమించింది.

ఈ కిషన్ రెడ్డి కొద్దిగా నెమ్మదస్తుడు, KCR కు సానుభూతిపరుడు అన్న పేరు కూడా వుంది. అంతే, అప్పటినుండి బీజేపీ దూకుడు తగ్గిపోయింది, బీజేపీ రేస్ లో నుండి పక్కకి పోయి, BRS కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ రేస్ లో కి వచ్చింది.

ఒకరకంగా, కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డి కి బండి సంజయ్ ను తొలగించడం, బాగా కలిసివచ్చింది, రేవంత్ అప్పటినుండి, మరింత గట్టిగా పోరాడాడు, దూకుడు పెంచాడు, ఫలితం, బీజేపీని పక్కకి నెట్టి, కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో గెలిచింది, అధికారం లోకి వచ్చింది.

ఊపు మీదున్న తెలంగాణ బీజేపీ ని , ఘోరంగా ఓడిపోయిందంటే దానికి కారణం ,కేంద్ర బీజేపీ, బండి సంజయ్ ని, అధ్యక్ష పదవి నుండి తొలగించడమే ప్రధాన కారణం , అని చాలా మంది ప్రజల ,పరిశీలకుల అభిప్రాయం.

ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంగతి కి వద్దాము.

కర్ణాటక IPS క్యాడర్ లో పనిచేస్తున్న అన్నామలై, తన పదవికి రాజీనామా చేసి, బీజేపీ లో చేరాడు, తమిళనాడు బీజేపీ కి , అన్నామలై ని ,అధ్యక్షుడిగా కేంద్ర బీజేపీ నియమించింది, ఈ విషయం లో బీజేపీ స్ట్రాటజిస్ట్ బి.యల్.సంతోష్ పాత్ర వుంది, .. మరో మెంటార్ గుర్తుమూర్తి కూడా అన్నామలై కి పూర్తి మద్దత్తు ఇచ్చాడు.

అప్పటినుండి అన్నామలై, బండి సంజయ్ లాగే, దూకుడుగా ముందుకు సాగాడు, ప్రత్యర్థి పార్టీ ల విమర్శలకు ధీటుగా జవాబులు ఇచ్చేవాడు, ఇంగ్లీష్ కూడా మంచి ప్రావీణ్యం ఉండటం వలన, బీజేపీ భావజాలాన్ని, ఆలోచనలను, నేషనల్ మీడియా తో , ప్రెస్ మీట్ ల ద్వారా పంచుకునేవాడు, తమిళనాడు లో బీజేపీ కూడా ఉందని , దేశానికి తెలిసేటట్టు చేసాడు

. అయితే,  2024  పార్లమెంట్ ఎన్నికల్లో, ఎంపీ గా పోటీ చేసి, ఓడిపోవడం, అన్నామలై కి మైనస్ అయింది. అయినా, తగ్గకుండా, 2026  లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో , బీజేపీ ని అధికారం లోకి రాడానికి , చాలా కృషి చేస్తూ వచ్చాడు.

అయితే, తమిళనాడు బీజేపీ కోసం ఇంత కష్టపడ్డ అన్నామలై , తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది.

అన్నామలై మొదటి నుంచి బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోకూడదని, సొంతంగానే, పోటీ చేయాలని కేంద్ర అధిష్టానానికి చెప్పేవాడు.

అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వచ్చే ఏప్రిల్ లో జరగబోయే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, .. బీజేపీ ఒంటరిగా కాకుండా, అన్నాడీఎంకే తో పొత్తు గా వెళదామని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది, అందుకే మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పళని స్వామితో, కేంద్ర బీజేపీ అధిష్టానం, పొత్తు కోసం చర్చలు మొదలు పెట్టింది.

అయితే, ఈ పొత్తు కుదరాలంటే, అన్నామలైని పక్కన పెట్టాలని, పళనిస్వామి కండిషన్ పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సామజిక వర్గం కూడా ఒక కారణం. పళనిస్వామి, అన్నామలై ఇద్దరూ ఇద్దరూ కొంగునాడు ప్రాంతానికి చెందినవారే , ఇద్దరూ కూడా గౌండర్ సామాజికవర్గానికి , చెందినవారే . బీజేపీ తో ఒకే కూటమిగా పోటీ చేస్తే, బీజేపీ, అన్నాడీఎంకే, ఇరు పార్టీ ల అధ్యక్షులు ఒకే సామాజికవర్గానికి చెందడం, పళని స్వామికి రాజకీయంగా ఇబ్బంది అవుతుంది.

2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే తో కలిసి బీజేపీ , పోటీ చేస్తే, అన్నాడీఎంకే కు, 66, బీజేపీ కి 4, పీఎంకే కి 5 స్థానాలు , మొత్తంగా ఈ కూటమికి, 77 స్థానాలు వచ్చాయి.  అన్నాడీఎంకే నుండి చీలిక వర్గాలు, మాజీ సీఎం పన్నీరు సెల్వం, శశికళ, దినకరన్ పూర్తిగా బలహీనపడటంతో, ప్రస్తుతం, మొత్తం అన్నాడీఎంకే పార్టీ కేడర్, పళని స్వామికి మద్దతుగా ఉంది..అంటే 2021 కన్నా, ఇప్పుడు అన్నాడీఎంకే మరింత బలం గా వుంది.

అందుకనే, బీజేపీ ఒంటరిగా వెళ్ళేకన్నా, ప్రస్తుతం బలంగా వున్న పళనిస్వామి నేతృత్వం లోని అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే, అధికారం లోకి వచ్చే అవకాశం వుంది, లేదా, ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం వుంది.

అయితే, అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకుంటే, పళని స్వామి కండిషన్ ప్రకారం, బీజేపీ అధ్యక్ష పదవికి , అన్నామలై రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రాజకీయ చందరంగంలో అన్నామలై బలయ్యాడు, పోనీ అన్నామలై, బీజేపీ కి రాజీనామా చేసి, వేరే పార్టీ పెట్టి పోటీ చేద్దామన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో , తన కొత్త పార్టీ కి, ఒక్క సీట్ కూడా వచ్చేటట్టు లేదు.

అందుకే అన్నామలై , రాజీపడి, బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడనే వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి, అన్నామలై పరిస్థితి , 2023 లో, తెలంగాణ లో, బీజేపీ ఆడిన రాజకీయ చదరంగానికి బలి అయిన బండి సంజయ్, అప్పటి పరిస్థితిని పోలివుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *