దర్శకుడు శంకర్ కు షాక్ ఇచ్చిన ED…….అసలు వివాదం ఏమిటి?

ED has seized Rs 10 crore worth of assets belonging to Shankar in a copyright dispute related to the movie Robot

తెలుగు లో శ్రీమంతుడు సినిమా వివాదం గుర్తుంది కదా. 

కొరటాల శివ దర్శకుడు, మహేష్ బాబు హీరో, ఆ మూవీ హిట్ అయింది, కానీ, ఆ సినిమా కధ నాదేనంటూ, శరత్ చంద్ర అనే రచయిత ( బీజేపీ నాయకుడు, టీవీ డిబేట్ లలో తరుచు కనపడే విల్సన్ కలం పేరు ఇది ) , తనకు పారితోషికం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మూవీ క్రెడిట్స్ తనకు ఇవ్వాలని, టైటిల్స్ లో కూడా రచయితగా నా పేరు ఉండాలి అని చాలా ఏళ్ళు కోర్టుల్లో పోరాటం చేసారు.

కోర్ట్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది, ఇప్పుడు ఆ కేసు ఏమయ్యిందో తెలియదు.

ఇప్పుడు అలాంటి వివాదమే, తమిళ ఫిలిం ఇండస్ట్రీ లో జరుగుతోంది.

2011 లో తమిళ్ లో యంథిరన్ పేరుతో, తెలుగులో రోబో పేరుతో సినిమా వచ్చింది, శంకర్ దర్శకుడు, రజనీకాంత్ హీరో. ఆ సినిమా తమిళ్ లో సూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. 300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు గాను 11.5 కోట్ల పారితోషికం తీసుకున్నాడు దర్శకుడు శంకర్.

అందరు అప్పుడు శంకర్ క్రియేటివిటీని, ప్రతిభను కొనియాడారు, వన్ అఫ్ ది బెస్ట్ క్లాసిక్ అండ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.

అయితే, మన తెలుగు సినిమా శ్రీమంతుడు లాగే, ఈ రోబో సినిమా కధ నాదేనంటూ, తన రచన జిగుబా అనే తన నవలకు కాపీ అని, ఆరూర్ తమిళ‌నాథన్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు, 2011 లో అంటే 14 ఏళ్ళ క్రితం. శంకర్ ఈ విషయాన్ని అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు.

కానీ ఈ తమిళ‌నాథన్ అప్పటినుండి ఈ విషయంలో కోర్టుల్లో పోరాడుతూనే వున్నాడు.

ఈ మధ్యే కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం, ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓ రిపోర్ట్ ఇచ్చింది, … ఆ నవల, ఈ సినిమా కథ ఒకటే, అంటే రోబో మూవీ, కాపీ కథే అని రిపోర్ట్ ఇచ్చింది. ఇది కాపీ రైట్ చట్టం సెక్షన్ 63 ప్రకారం నేరమే.

రోబో మూవీ వివాదం లోకి ED

అయితే, ఈ వివాదం లోకి ED (Enforcement directorate) ప్రవేశించి ,శంకర్‌కు షాక్ ఇచ్చింది… రోబో సినిమాకు సంబంధించి కాపీ రైట్ వివాదంలో ఈడీ శంకర్ కు సంబంధించిన 10 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది…ఈనెల 17న, మనీలాండరింగ్ చట్టానికి సంబంధించి ఈ చర్య తీసుకుంది.

కాపీ రైట్ నిబంధనలను ఉల్లంఘించే కేసుల్లో స్థిరాస్తుల స్వాధీనం ఇదే మొదటిసారి అనీ ఈడీ ఓ ప్రకటనలో చెప్పుకుంది…

ఒక కథ కాపీ రైట్ వివాదం లో ఈడీ ఎలా ప్రవేశిస్తుందో అర్ధం కాదు, భవిష్యత్తులో దీనికి సమాధానం దొరుకుతుందేమో.

అసలే భారతీయుడు , గేమ్ ఛేంజర్ మూవీ ల డిజాస్టర్లతో , శంకర్ లో క్రియేటివిటీ నశించింది, సరుకు అయిపొయింది, అవుట్ డేటెడ్ అయిపోయాడని విమర్శలు ఎదుర్కొంటున్న శంకర్ కు తాజా సంఘటన మరో పెద్ద ఎదురు దెబ్బ.

ఈ ఈడీ అంశంలో, శంకర్ ఎలా ప్రొసీడ్ అవుతాడో చూడాలి.

ఒకటి మాత్రం అర్ధం కాదు, కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, దర్శకుడు, హీరో లు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు, కానీ ఆ సినిమా
కధా రచయితలకు మాత్రం తక్కువ ఇస్తారు.

అలాగే ఈ కధ నాదేనంటూ, ఎవరైనా వారి దగ్గరకొచ్చి చెప్పినా , లేదా ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినా, వెంటనే, అది పరిశీలించి, నిజం గా అనిపిస్తే, ఒప్పుకుని, ఆ రచయితకు అప్పుడే కొన్ని లక్షలు ఇచ్చి, వారి పేరు సినిమా టైటిల్స్ లో ఎందుకు వేయడానికి వొప్పుకోరో అర్ధం కాదు. కోట్లు తీసుకుంటున్న వారికి ఈ కక్కుర్తి ఎందుకో. గోటితో తో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు.

ఇప్పుడు శంకర్ అయినా, అప్పుడు కొరటాల శివ అయినా , ఇదే తప్పు చేసారు. భవిష్యత్ దర్శకులు , ఇలా ,కధ చౌర్యం గురించి ఫిర్యాదులు వచ్చినప్పుడు, వెంటనే, పరిష్కరించుకోకపోతే, ఇలాగే వారికి ఎదురు దెబ్బలు తగులుతాయి, డబ్బు, కీర్తి పోగొట్టుకునే అవకాశం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *