ఇంగ్లాండ్ తో జరిగిన 5 వ టీ20 లో, తన 17 వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో, అడిల్ రషీద్ , జోఫ్రా ఆర్చర్ లాంటి, మేటి ఇంగ్లండ్ బౌలర్ల బౌలింగ్ ను వూచకోత కోసి, పిడుగుల్లాంటి షాట్ లతో , విరుచుకుపడి , 53 బంతులలో, 135 పరుగులు చేసి, భారత్ గెలుపులో కీలకపాత్ర వహించిన అభిషేక్ శర్మ, భారత్ క్రికెట్ కొత్త హీరోగా అవతరించాడు. ఈ మ్యాచ్ లో భారత్ తరుపున టీ20 ల్లో 135 పరుగులతో అత్యధిక పరుగులు రికార్డు , అలాగే 13 సిక్సర్లతో, భారత్ తరపున టీ20 ల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ,వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ అభిషేక్ మీద ప్రశంసలు కురిపించాడు, హర్భజన్ సింగ్ అయితే, భారత్ క్రికెట్ కు మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికాడని వ్యాఖ్యానించాడు. ఈ 5వ టీ20 లో ప్రత్యేకత ఏమిటంటే, మొదటి 10 ఓవర్లలో, విధ్వంసం సృష్టించిన అభిషేక్ , వికెట్లు వెంట వెంటనే రాలడంతో, కొంచెం నెమ్మదించి, 18 వ ఓవర్ వరకు , విధ్వంసం, ఆచితూచి ఆడటం , ఈ రెండూ బాలన్స్ చేసుకుంటూ ఆడాడు.
స్పిన్నర్లను, పేసర్ల ను, సమర్ధవంతంగా ఎదుర్కొనే, అభిషేక్ కు, టీ20 ల్లో ఇది రెండవ సెంచరీ. గత ఏడాది, జింబాబ్వే తో, టీ20 సిరీస్ లో తన అరంగేట్రం సిరీస్ ను ఆరంభించిన అభిషేక్ , 47 బంతుల్లోనే , తన మొదటి సెంచరీ సాధించాడు. ఇప్పటిదాకా, 17 ఇంటర్నేషనల్ టీ20లు ఆడిన అభిషేక్ శర్మ, 193.84 స్ట్రైక్ రేట్ తో, 33.43 సగటు తో, 535 పరుగులు చేసాడు, ఇందులో, 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీ లు వున్నాయి.
పంజాబ్ కుర్రాడైన, ఈ అభిషేక్ శర్మ, IPL లో , 2022 నుంచి, సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు, 2023 సీజన్ లో , ట్రావిస్ హెడ్ తో కలిసి, ఓపెనింగ్ చేస్తూ, 144 స్ట్రైక్ రేట్ తో, 226 పరుగులు సాధించాడు.
అభిషేక్ శర్మ నేపధ్యం చూస్తే..
2017 లో, సన్ రైజర్స్ కు యువరాజ్ సింగ్ ఆడుతున్నపుడు, 18 ఏళ్ల వయసున్నఅభిషేక్ శర్మ అక్కడ శిక్షణ శిబిరానికి, ఎంపికయ్యాడు, ఇద్దరిదీ పంజాబ్ రాష్ట్రమే. తనలాగే లెఫ్ట్ హ్యాండ్ బేటర్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అయిన, అభిషేక్ శర్మ లో పతిభను గుర్తించిన యువరాజ్, అతన్ని ప్రోత్సహిస్తూ , సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. 2020లో కరోనా-లాక్ డౌన్ సమయం లో యువీ గైడెన్స్ లో సాధన చేసి తన ఆటను మెరుగుపరుచుకున్నాడు అభిషేక్ . తాను ఎక్కడుంటే, అక్కడికి అభిషేక్ ను పిలిపించుకుంటూ అతని చేత సాధన చేయించేవాడు. భారీ షాట్ లు ఆడే నైపుణ్యం పెరగడానికి బ్రియాన్ లారా సలహాలు తీసుకోమన్నది, యువరాజే నని , లారా సలహా మేరకే, గోల్ఫ్ షాట్ లు సాధన చేయడం ద్వారా, భారీ షాట్లు కొట్టే నైపుణ్యం అభిషేక్ పెంచుకున్నాడని, అభిశేఖ శర్మ తండ్రి, రాజ్ కుమార్ శర్మ చెబుతున్నారు.
తాను ఎప్పటికైనా, ఇండియా క్రికెట్ టీం తరుపున ఆడతానని, జట్టును గెలిపించే స్థాయికి చేరుకుంటానాని, చెబుతూ, తనలో ఆత్మ విశ్వాసాన్ని, నమ్మకాన్ని యువరాజ్ పెంచాడని , అభిషేక్ చెబుతూ వుంటాడు.