ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తన కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత క్రికెట్ బోర్డు , BCCI అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
దీని నేపధ్యం చూస్తే..
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్‌వాష్ అయి, ఘోరమైన ఓటమి చవి చూసింది. విదేశాలలో ఓడిపోయినా , ఎవరూ అంతగా పట్టించుకోపోదురు, కానీ, స్వదేశం లో ఎప్పుడూ ఇంత ఘోరమైన ఓటమి చవిచూడలేదు. అప్పుడే క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు , జట్టును తీవ్రంగా విమర్శించారు. అవమానాలు పాలైన భారత జట్టు, ఆస్ట్రేలియా సిరీస్ లోనయినా రాణించి, ఈ ఓటమిని మరిపిస్తుంది అనుకున్నారు.
రోహిత్ లేకుండా , ఆస్ట్రేలియా లో పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలవడంతో, ఇండియా మళ్ళీ విజయాల బాట పట్టింది, అని అందరూ సంతోషించారు, కానీ, రోహిత్ కెప్టెన్ గా ఆడిన మిగతా 3 టెస్టులతోపాటు, రోహిత్ తప్పుకున్న, ఆఖరి, సిడ్ని టెస్ట్ లో కూడా ఇండియా ఓడిపోయి, సిరీస్ 1-3 తో ఘోరంగా ఇండియా ఓడిపోయింది. రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌లలో 6.2 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పేలవమైన ఫామ్ కారణంగా, 3 టెస్ట్ మాచ్ లలో అస్సలు పరుగులు చేయలేక, విఫలం అయి, తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు జడిసి, సిడ్నీలో జరిగిన ఆఖరిది మరియ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ నుండి వైదొలగాలని నిర్ణయించుకుని, రోహిత్, జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీని అప్పగించాడు.
ఈ సందర్బంగా, క్రికెట్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న, ఇండియన్ బేటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సిడ్నీ టెస్ట్ ఆడకూడదనే రోహిత్ నిర్ణయాన్ని ప్రశ్నించాడు. టెస్ట్ క్రికెట్ లో రోహిత్ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా , వేరే వారికి కెప్టెన్సీ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భారత బ్యాటింగ్ లెజెండ్ అభిప్రాయపడ్డాడు.
అయితే, సునీల్ గవాస్కర్ చేసిన కఠినమైన విమర్శలు రోహిత్ శర్మకు నచ్చలేదు, అందుకే రోహిత్ BCCI ని సంప్రదించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పరిష్కరించాలని బోర్డును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బ్లాగర్ నివేదికల ప్రకారం, గవాస్కర్ తనను ఈ విధంగా విమర్శించడం అనవసరం, దీనివల్ల వత్తిడి పెరిగింది అని రోహిత్ మరియ టీమ్ ఇండియా భావించినట్టుగా తెలుస్తోంది.
ఆస్ట్రేలియా టెస్ట్ పర్యటనలో నిరాశపరిచే ప్రదర్శన తర్వాత, అజిత్ అగార్కర్ మరియు టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని BCCI సెలక్షన్ కమిటీ ఆదేశాల మేరకు రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఆడటానికి తిరిగి వచ్చాడు, దీనివల్ల రోహిత్ మరలా ఫామ్ లోకి రాయడానికి ప్రయత్నించవచ్చు అని క్రికెట్ వర్గాలు ఆశించాయి. అయితే, ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో జమ్మూ కాశ్మీర్‌తో ముంబై రంజీ మాచ్ లో మొదటి ఇన్నింగ్స్ విఫలమైన రోహిత్ , రెండో ఇన్నింగ్ లో దూకుడుగా ఆడి , 28 పరుగులు చేశాడు, అయితే, టెస్ట్ క్రికెట్ లో ఎక్కువసేపు క్రీజ్ లో వుండి ,బేటింగ్ ఎక్కువ సేపు చేసి, ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన రోహిత్, దూకుడుగా ఆడి వికెట్ సమర్పించుకోడం పై, విమర్శలు వచ్చాయి, ఫలితంగా అంతర్జాతీయ ఆటగాళ్లు వున్న ముంబై, అనామక జట్టు అయిన, జమ్ము కాశ్మీర్ జట్టు చేతిలో ఓడిపోయింది .
జమ్మూ కాశ్మీర్‌తో ముంబై ఓటమి తర్వాత, ” పిచ్ పరిస్థితుల ఆధారంగా ఆటను సర్దుబాటు చేసుకోకుండా, దూకుడుగా ఆడాలనే రోహిత్ శర్మ మరియు శ్రేయాస్ అయ్యర్ ఉద్దేశాలను సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. వారు ఏదో తప్పక రంజీ ట్రోపి ఆడారు కానీ మనస్పూర్తిగా అడినట్టు లేదు, ఇలాంటి ఆట వలన, రంజీ లలో ఆడి వూపయోగం ఏముంది అని సన్నీ ఘాటుగా విమర్శించాడు. దూకుడు మంత్రం ఫ్లాట్ పిచ్ ల పై పని చేస్తుంది కానీ, బౌలింగ్ కు అనుకూలమైన పిచ్ ల పై ఎలా పని చేస్తుంది, ఈ బౌలింగ్ పిచ్ ల పై, టెక్నిక్ మాత్రమే పని చేస్తుందని గవాస్కర్ తన స్పోర్ట్స్ స్టార్‌లోని తన కాలమ్‌లో రాశారు.