13th December 2025.
2019 ఎన్నికల్లో, టీడీపీ కి కంచుకోటలాంటి నియోజకవర్గాలు ఎంచుకోకుండా, 30 ఏళ్లుగా టీడీపీ గెలవని మంగళగిరి నియోజకవర్గం ఎంచుకుని నారా లోకేష్ తప్పు చేసారని, చాలా మంది అన్నారు. దానికి తగ్గట్టుగానే, లోకేష్ 2019 లో మంగళగిరి లో పోటీ చేసి, 5,000 ఓట్లతో పరాజయం పాలయ్యాడు. .
ఆ తరువాత 5 ఏళ్ళు, లోకేష్ రాజకీయాలకు పనికి రాడు, దొడ్డి దారిన మంత్రి అయ్యాడు, పప్పు, చంద్రబాబు కొడుకునే గెలిపించుకోలేకపోయాడు, అసమర్ధుడు, ఇలా, శాసనసభలో , బయట, ఎన్నెన్నో అవహేళనలు, దీనికితోడు బాడీ షేమింగ్.
వీటిని అన్నిటిని లోకేష్ తట్టుకున్నాడు, ఎక్కడ పోయిందో, అక్కడే వెతుక్కోవాలన్నారుగా, లోకేష్ చేసింది అదే.
మంగళగిరిని గత 5 ఏళ్ళు అంటిపెట్టుకున్నాడు, అక్కడ ప్రజల్లో తిరిగాడు, సొంత నిధులతో ,ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు.
అన్న కాంటీన్ సొంత డబ్బులతో నిర్వహించాడు, గెలిచిన తరువాత మంగళగిరిని ఎలా అభివృద్ధి చేస్తాడో, ఇల్లిల్లు, అపార్టుమెంట్లు, అన్ని తిరిగి చెప్పాడు.
అక్కడ ఏ పరిశ్రమలు తేబోతున్నాడో వివరించాడు. ఫలితం , 2024 అసెంబ్లీ ఎన్నికల్లో, 90,000 ఓట్ల మెజారిటీ తో, ఘనవిజయం సాధించాడు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది, లోకేష్ మంత్రి అయ్యాడు అవసరం తీరిపోయింది, ఇంక నియోజకవర్గంతో పని ఏముంది అని ప్రజల్ని గాలికి వదిలేసే కొంతమంది ఎమ్మెల్యేల్లా కాకుండా, గెలిచిన తరువాత గత 9 నెలలు కూడా వీలయినంతవరకు మంగళగిరి ప్రజలతో మమేకం అవుతున్నాడు , ప్రజా దర్భారు పెట్టి, స్థానిక ప్రజల దగ్గరనుండి అర్జీలు తీసుకున్నాడు.
తాజాగా ఆయన మంగళగిరి నియోజకవర్గం లో చేసిన ఓ మంచి పని వెలుగులోకి వచ్చింది.
మంగళగిరి ఎకోపార్కు మార్నింగ్ వాకర్స్ కు ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో మంది ఉదయం 6 నుండి 9 వరకు అక్కడ వాకింగ్ చేస్తూ వుంటారు, కానీ కొంత ఎంట్రీ ఫీజు కట్టాలి.
రోజు ఎంట్రీ ఫీజు కట్టాలంటే, మధ్యతరగతి వారికి, పింఛను తీసుకుంటున్న పెద్దలకు కొద్దిగా ఇబ్బందే.
లోకేష్ గత ఎన్నికల ప్రచారంలో వున్నపుడు, ఈ వాకర్స్ లోకేష్ ను కలిసి ఎకోపార్కులో ప్రవేశరుసుం తొలగించాల్సిందిగా కోరారు. తాను గెలిచిన తరువాత, అలాగే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఎంట్రీ ఫీజు రద్దు చేస్తామని వారికి హామీ ఇచ్చాడు, లోకేష్.
గెలిచిన తరువాత, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, ఈ ఎకో పార్క్ ఎంట్రీ ఫీ సమస్య గురించి అటవీ అధికారులతో మాట్లాడాడు . అయితే అటవీ శాఖ ఆధ్వర్యంలో వుండే పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని, రాష్ట్రవ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలుకాదని, అటవీశాఖ అధికారులు, చెప్పారు.
దానితో ఆ విషయం లోకేష్ వదిలెయ్యకుండా, పార్క్ లో వాకర్స్ ద్వారా ఏటా వచ్చే మొత్తం కనుక్కుని, 5 లక్షలవుతుందని తెలుసుకుని, ఆ 5 లక్షలు తను వ్యక్తిగతంగా చెల్లిచాడు.
ఇకనుండీ మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుం లేకుండా ఉదయం 6నుంచి 9గంటలవరకు ఎకోపార్కులో నడక సాగించవచ్చని , మంగళగిరి వాసులకు తెలియపరిచాడు.
ఈ విషయం ఇంకా తెలియని కొంతమంది, ఈ ఎకో పార్క్ లో ఉదయాన్నే వాకింగ్ చెయ్యడానికి వచ్చినపుడు, ఎంట్రీ ఫీజు చెల్లిద్దామని చూస్తే, వారు ఆ ఫీజు కట్టక్కరలేద్దని, ఫీజు రద్దు అయిపోయిందని, లోకేష్ స్వయంగా తన వ్యక్తిగత నిధులనుండి ఆ మొత్తాన్ని చెల్లిచారని తెలిసి ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడు, తమ ఎమ్మెల్యే అని లోకేష్ ను ప్రశంసిస్తున్నారు.